Pawan Kalyan CM Candidate: టిడిపి,జనసేన మధ్య పొత్తు కుదిరింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ పొత్తు ప్రకటన చేశారు. ఇంకా సీట్ల సర్దుబాటు పై స్పష్టత రాలేదు. అసలు జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్ని అని క్లారిటీ లేదు. అయితే ఈ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటిస్తే ఏకపక్ష విజయం దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే మేలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.ఈ విషయంలో గతంలో అభ్యంతరాలు తెలిపిన వారు సైతం.. ఇప్పుడు సానుకూలత చూపుతున్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారాలని జనసేన భావించింది. కానీ ప్రజా వ్యతిరేక పాలనను, విధ్వంసకర విధానాలను అనుసరిస్తున్న జగన్ ను గద్దె దించాలంటే ఒంటరి పోరు శ్రేయస్కరం కాదని భావించి పవన్ పొత్తు నిర్ణయానికి వచ్చారు. సామాజిక సమీకరణలతో పాటు ప్రజల్లో బలమైన వాయిస్ గా మారిన పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే కూటమి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది అని జన సైనికుల అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పవన్ తీసుకున్న నిర్ణయం జనసేన అభిమానులకు ఇష్టం లేదు. అయినా సరే అధినేత పై ఉన్న అభిమానంతో వారు పొత్తు నిర్ణయానికి సై అన్నారు.
ప్రధానంగా కాపు సామాజిక వర్గం పవన్ సీఎం కావాలని బలంగా ఆకాంక్షిస్తోంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపులు, గాజుల కాపులు పవన్ ను తమ వాడిగా భావిస్తున్నారు. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే దాదాపు 14 నుంచి 15% వరకు ఓట్లు ఏకపక్షంగా కూటమికి పడే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాపులకు సీఎం పదవి దక్కలేదని ఆ వర్గంలో అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఈ కూటమితో మళ్లీ చంద్రబాబే సీఎం అని ప్రకటిస్తే మాత్రం కాపు, అనుబంధ సామాజిక వర్గాల్లో చీలిక వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంతకాలం చంద్రబాబు మంచి పాలనా దక్షుడిగా పేరు దక్కించుకున్నారు. తాజా కేసులతో ఆయన క్లీన్ ఇమేజ్ పోయింది. ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారనుంది. ఇన్నాళ్ళు తాను ఒక నిప్పు అని చంద్రబాబు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అలా చెప్పడానికి కుదిరే పని కాదు. అందుకే పవన్ అయితేనే కరెక్ట్ క్యాండిడేట్ అవుతారని సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు అభ్యంతరం చెప్పిన టిడిపి అభిమానుల సైతం.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. జగన్ దూకుడుకు కళ్లెం వేయగల శక్తి పవన్ కి ఉందని బలంగా నమ్ముతున్నారు. అటు టిడిపి అనుకూల మీడియా సైతం.. అవసరమైతే, అనివార్యంగా మారితే పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.