Nara Lokesh And Pawan Kalyan: ప్రతి రాజకీయ పార్టీకి, నాయకుడికి కొన్ని రకాల వ్యూహాలు ఉంటాయి. అవి కచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలే పని చేస్తాయి కాబట్టి. అయితే ఏపీలో యువనేత నారా లోకేష్ మాత్రం పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోగలరు. పరిస్థితిని అంచనా వేసి మసులుకోగలరు. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. అలా అందుకున్న సక్సెస్ ను ఒడిసి పట్టుకునే క్రమంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం అభినందనలు అందుకుంది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక విధంగా యువరాజు పట్టాభిషేకం అయిపోయినట్టే. అటు మంత్రిగా ప్రభుత్వంలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతూ.. ఇతర పార్టీల జాతీయ నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఒక పరిపూర్ణమైన నాయకుడిగా అవతరించారు. అయితే ఇంతలా ఎదిగిన నారా లోకేష్.. పదే పదే పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయడానికి మాత్రం ఎక్కువమంది సహించుకోలేకపోతున్నారు. కానీ దీని వెనుక కూడా వ్యూహం ఉంది.
* వైసీపీ చికాకు అంతా కాదు..
ఇటీవల ఓ విషయాన్ని బయటపెట్టారు నారా లోకేష్. క్యాబినెట్లో మీరు అందగాడు అని ఎవరో సంబోధించేసరికి.. నేను కాదు ‘పవన్ అన్న’ అందగాడు అంటూ చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు లోకేష్. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఎందుకు మాట మాటకు పవన్ అని జాకీలు లేపి ఎత్తుతావు.. పవన్ లేని మాటలు ఆడ లేవా.. పవన్ ఉంటేనే రాజకీయాలు చేయగలవా? అని ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపించాయి. అంటే ఈ వ్యాఖ్యలు ఎవరు చేస్తారో ఇట్టే అర్థం అయిపోతుంది. కచ్చితంగా అవి వైసిపి సానుభూతిపరుల నుంచి వచ్చిన మాటలే. అంటే ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. పవన్ తో లోకేష్ సాన్నిహిత్యం వైసిపికి నచ్చడం లేదు. అందుకే లోకేష్ తరచూ పవన్ అన్న అనే మాట వాడుతున్నారు అని.. దీని వెనుక ఉన్న వ్యూహం అదేనని.. వైసిపి వ్యతిరేకిస్తుంది అంటే కచ్చితంగా ఇది కూటమికి ప్రయోజనం కలిగించే విషయమే కదా?
* సినిమా పరంగా..
సాధారణంగా మెగా ఫ్యామిలీ అని అనేసరికి నందమూరి ఫ్యామిలీకి వ్యతిరేకం అనే ఆలోచించే పరిస్థితి ఉండేది. అంతలా ఉండేది అప్పట్లో సినిమా వైరం. హీరోలుగా వారి మధ్య మంచి సంబంధాలు ఉండవచ్చు. కానీ ఒక రకమైన వైరుధ్యం ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఉంది. అటువంటి నందమూరి కుటుంబానికి చెందిన పార్టీతో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ పార్టీ పొత్తు పెట్టుకుంది అంటే.. కచ్చితంగా ఆ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలి. ఆ రెండు పార్టీల అధినేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, లోకేష్ ల మధ్య మంచి బంధం ఏర్పడాలి. అందుకే పదే పదే పవన్ అన్న అని వ్యాఖ్యానిస్తున్నారు లోకేష్.
* సామాజికపరంగా..
రాష్ట్రంలో కుల సమీకరణ ఎక్కువ. రెండు ప్రధాన కులాల మధ్య వైరుధ్యం ఉంటుంది. మూడు ప్రధాన కులాల్లో రెండు ప్రధాన కులాలు కలిస్తే కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన మొన్నటి ఎన్నికల్లో కాపు – కమ్మ సామాజిక వర్గం ఫార్ములా పనిచేసింది. అయితే ఆ వాతావరణం చెడగొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకే ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు అని భావిస్తున్నారు నారా లోకేష్. అందుకే పవన్ అన్న అంటూ దానికి సమాధానం చెబుతూనే ఉన్నారు. పవన్ అంటే ఎనలేని గౌరవభావం ప్రదర్శించడానికి ఇది కూడా ఒక కారణం.
* గౌరవం ఇచ్చిపుచ్చుకొని..
జన సైనికులు గౌరవాన్ని కోరుకుంటున్నారు. తమ పార్టీ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అని మెజారిటీ పార్టీ శ్రేణులు, అభిమానుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి సాధ్యమైందని కూడా భావిస్తుంటారు. వారిని సంతృప్తి పరిచేందుకు లోకేష్ పవన్ విషయంలో ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఇక జనసైనికులు ఎప్పుడు మంట రేపు తామా అన్న ఆలోచనలో ఉంటారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆ ఆలోచనకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా.. వారి ప్రయత్నాలు బెడిసి కొట్టేలా వ్యూహంలో భాగంగా లోకేష్ పవన్ అన్న అని సంబోధిస్తుంటారు. దానిని తట్టుకోలేకపోతున్నారు వైసిపి శ్రేణులు. అక్కడే లోకేష్ వ్యూహం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయాల గురించి ఎవరి విశ్లేషణ వారిదే. అయితే ఒక్క లోకేష్ మాత్రమే కాదు పవన్ సైతం తిరిగి అది అభిమానం చూపిస్తుంటారు. లోకేష్ వ్యూహానికి సాయం చేస్తుంటారు.