Palle Panduga : వేల కిలోమీటర్ల రహదారులు.. ఏపీలో నేటి నుంచి ‘పల్లె పండుగ’

గత ఐదేళ్ల వైసిపి పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తీసుకట్టుగా ఉండేది. అందుకే గ్రామాల రూపురేఖలు మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి నుంచి పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

Written By: Dharma, Updated On : October 14, 2024 11:19 am

Palle Panduga

Follow us on

Palle Panduga : ఏపీలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13వేల పంచాయితీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించనుంది. పల్లె పండుగ పేరిట సిసి రహదారులు, కాలువలు, తదితర నిర్మాణ పనులను చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజల భాగస్వామ్యంతో రాజకీయాలకు అతీతంగా సభలు పెట్టారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. అలా గుర్తించిన పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నేటి నుంచి ఆ పనులకే శంకుస్థాపనలు చేయనుంది. ఈనెల 20 వరకు శంకుస్థాపనలు కొనసాగనున్నాయి. వంద రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి సంక్రాంతి నాటికి అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

* పవన్ నిర్ణయం అది
జనసేన అధినేత పవన్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు.పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆయన పెద్దపీట వేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఉపాధి హామీ నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టకుండా చూడాలని భావించారు. గతంలో ఈ నిధులనే వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలకు మళ్ళించింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా చూడాలని పవన్ భావించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులు 4,500 కోట్ల రూపాయలను.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని మంత్రి పవన్ డిసైడ్ అయ్యారు.

* రాష్ట్రవ్యాప్తంగా 30 వేల పనులు
ఈరోజు నుంచి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల పనులు చేపట్టనున్నారు. దాదాపు మూడు వేల కిలోమీటర్ల సిసి రహదారులు, 500 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించడం విశేషం. 2025 సంక్రాంతి నాటికి గ్రామాల రూపురేఖల్లో కొంతవరకు మార్పు తేవాలన్నదే మంత్రి పవన్ ఉద్దేశం. అయితే పవన్ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమోదముద్ర వేసింది. ఈరోజు నుంచి జరిగే శంకుస్థాపనల్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే మంత్రి పవన్ అధికారులను ఆదేశించారు. మొత్తానికి అయితే పల్లె గూటికి కొత్త పండగ రానుంది అన్నమాట.