Palla Srinivas: నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. మంత్రులకు శాఖల కేటాయించిన ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసుని నియమించారు. ఇప్పటివరకు ఆ పదవిలో అచ్చెనాయుడు కొనసాగే వారు. కానీ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలక వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య శాఖను కేటాయించారు. దీంతో జోడు పదవులు నిర్వర్తించడం కత్తి మీద సాము. అందుకే ఆయన స్థానంలో గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా శ్రీనివాసరావును నియమించారు చంద్రబాబు.
పల్లా శ్రీనివాస్ టిడిపి నాయకత్వానికి వీర విధేయుడు. గాజువాక నుంచి 2014లో గెలిచారు. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేశారు. ఓట్లు చీలిపోవడంతో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి గెలిచారు. కానీ ఎన్నికల్లో పొత్తు ఉండడంతో టిడిపి అభ్యర్థిగా మరోసారి బరిలో దిగారు పల్లా శ్రీనివాస్. మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. రాష్ట్రంలోనేఅత్యధిక మెజారిటీని నమోదు చేసుకున్నారు. దీంతో పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు.
రాష్ట్రంలో చాలామంది సీనియర్లకు ఈసారి క్యాబినెట్లో చోటు లేకుండా పోయింది.అటువంటి వారిలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ పట్ల విధేయత చూపిన పల్లా శ్రీనివాసరావు వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్లా శ్రీనివాసరావును టార్గెట్ చేసుకుంది. విశాఖపై పట్టు సాధించడం కోసం జగన్ ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పల్లా శ్రీనివాసరావును వైసీపీలో చేర్పించేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు పల్లా ఒప్పుకోలేదు. రకరకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన పిఠాపురం వైపు మొగ్గు చూపడంతో పల్లా శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అయింది. మంత్రిగా అవకాశం ఇస్తారనుకుంటే.. టిడిపి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించి చంద్రబాబు ఆశ్చర్యపరిచారు. ఒకటి రెండు రోజుల్లో అధ్యక్ష పదవి బాధ్యతలను పల్లా శ్రీనివాసరావు తీసుకునే అవకాశం ఉంది.