YCP Party
YCP: కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే భారీగా వ్యతిరేకత పెరిగిందని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ చెబుతుంటారు. అయితే నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆ వ్యతిరేకత ఏమీ లేదని తేలిపోయింది. అంతా పటా పంచలు అయింది. నాలుగు జిల్లాల్లో ప్రజాభిప్రాయం వెల్లడయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే టిడిపి మద్దతుదారులు ఇద్దరు అంత మెజారిటీతో గెలిచేవారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
Also Read: కిరణ్ రాయల్ వివాదంలో ట్విస్ట్.. యూటర్న్.. బాధితురాలు నోట జనసేన కీలక నేత కుట్ర కోణం
* కీలక జిల్లాల్లో..
గుంటూరు-కృష్ణా( Guntur Krishna districts ) రాజకీయంగా కీలక జిల్లాలు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ రాజకీయ చైతన్యవంత జిల్లాలుగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో ఎటువంటి సెంటిమెంట్ కు తావు లేకుండా పోయింది. అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. తమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి కూడా టిడిపి పట్ల ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు ద్వారా సమాధానం చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో అప్పట్లో టిడిపికి ఓటమి తప్పలేదు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఈ రెండు జిల్లాలు అండదండగా నిలిచాయి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నుంచి బరిలో దిగిన ఆలపాటి రాజా విజయం సాధించారు. ఆయన ఏకంగా లక్షకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది.
* రాజకీయంగా చైతన్యవంతం..
ఉభయగోదావరి జిల్లాలు( Godavari districts ) సైతం రాజకీయంగా చైతన్యవంతం అయినవి. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఉభయగోదావరి జిల్లాలో గెలిచే పార్టీలు అధికారంలోకి వస్తాయన్న సెంటిమెంట్ ఉండేది. అంతలా అక్కడి ప్రజల నిర్ణయం ఉంటుంది. 2014 ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టిన ఉభయగోదావరి ప్రజలు 2019లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీకి అండగా నిలిచారు. అయితే అక్కడ ప్రజల్లో అసంతృప్తి ప్రారంభం అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన పేరాబత్తుల రాజశేఖర్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఏమంత చిన్న విషయం కాదు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే కచ్చితంగా ప్రస్ఫుటమయ్యేది. కానీ అటువంటి పరిస్థితి కనిపించలేదు.
* 61 అసెంబ్లీ సీట్ల పరిధిలో..
మొత్తం ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 61 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొన్న సాధారణ ఎన్నికల్లో ( general elections )ఒకటి రెండు చోట్ల మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా టిడిపి కూటమిని నిలువరించేందుకు వేరే అభ్యర్థులకు మద్దతు తెలిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే టిడిపి అభ్యర్థుల విజయాన్ని నియంత్రించ లేక పోయింది. లక్షల మెజారిటీ రావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత అనే మాట కొట్టుకుపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు ఇదే కారణం.
Also Read: గవర్నర్ అనుమతే తరువాయి.. విడదల రజిని చుట్టూ ఉచ్చు!