YS Jagan : ఎన్నికల్లో వైసిపి కి ఘోర పరాజయం తప్పలేదు. కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయ్యింది ఆ పార్టీ. పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి నాలుగు సీట్లు దక్కించుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ కు దక్కలేదు. ఈ పరిస్థితి వస్తుందని జగన్ కూడా కలలో ఊహించలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లారు జగన్. కానీ ప్రజలు వైసీపీ పాలనను ఆహ్వానించలేదు. ఎన్నికల్లో ఆదరించలేదు. కూటమికి అంతులేని మెజారిటీ కట్టబెట్టారు. 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది కూటమి.అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నేరుగా జగన్ స్పీకర్ కు లేఖ రాశారు. కానీ స్పీకర్ నుంచి సానుకూలత రాలేదు. విపక్ష నేత హోదా ప్రకటించలేదు. అసలు రాజ్యాంగంలో ప్రతిపక్ష నేత విషయంలో ఎటువంటి స్పష్టత లేదని.. వాటికి అసలు సంఖ్యాబలంతో పనిలేదని జగన్ వాదించారు. తన వాదనలు వినిపించారు. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. కానీ న్యాయస్థానం మాత్రం భిన్నంగా స్పందించింది. జగన్ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి కి దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని కోరుతూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు స్పీకర్, కార్యదర్శి తమ అభిప్రాయాలు హైకోర్టుకు తెలియజేయునన్నారు. అందుకు అనుగుణంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.
* జగన్ కామెంట్స్ వైరల్
జగన్ ప్రతిపక్ష హోదాకు పట్టుబడుతున్న నేపథ్యంలో… టిడిపి వినూత్నంగా గతంలో జగన్ చేసిన కామెంట్స్ ను తెరపైకి తెచ్చింది.సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిడిపి 23 స్థానాలకే పరిమితం అయింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి వైసీపీలోకి ఫిరాయించారు. ఆ సమయంలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపి బలం 19 స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని జగన్ నాడు కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే కామెంట్స్ ను కూటమి పార్టీలు హైలెట్ చేస్తున్నాయి.
* స్పీకర్ ఎంపికకు దూరం
వాస్తవానికి స్పీకర్ ను ఎన్నుకోవడంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర. కానీ జగన్ మాత్రం స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు నియామకం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు అయ్యన్నపాత్రుడు వైసీపీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వైసిపి ఇంకా చచ్చిపోలేదని.. దానిని చచ్చేదాకా కొట్టాలంటూ వ్యాఖ్యానించారు. అవే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి అప్పగించడం తగదని జగన్ తప్పు పట్టారు. అదే స్పీకర్ కు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ లేఖ రాయడం విమర్శలకు తావిచ్చింది.
* ఆ నిబంధనను తోసిపుచ్చి..
వాస్తవానికి అసెంబ్లీలో 10 శాతం బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిబంధన ఉంది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన ఆ శాతం సరిపోదు. కానీ స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది. ఆ విచక్షణతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చు. కానీ జగన్ వైఖరి తెలిసిన కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించలేదు. అందుకే జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కోర్టు జోక్యం చేసుకోదని.. అసెంబ్లీ నుంచి ఏదో రూపంలో బయటకు వెళ్లేందుకు జగన్ ఈ నాటకం ఆడుతున్నాడని కూటమి పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.