Jr NTR – Chandrababu Naidu : ఎవరైనా కష్టాన్ని నమ్ముకుంటారు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నందమూరి కుటుంబసభ్యులను నమ్ముకుంటారు. వారి సాయంతోనే బయటపడుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంటూ హడావుడి చేశారు. నందమూరి కుటుంబసభ్యలనందర్నీ ఒకే వేదికపైకి తేవాలని చూశారు. వారి సాయంతోనే 2024 ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారు. అయితే నందమూరి కుటుంబమంతా మెత్తబడినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లొంగలేదు. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. చంద్రబాబు పాచికకు చిక్కకుండా వ్యూహాత్మకంగా సైడయ్యారు.
నందమూరి కుటుంబాన్ని బలిపశువుగా వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. మొత్తం మూడు తరాలను ఎలా వాడుకోవాలో అలా వాడేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చినప్పుడే కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే పార్టీలో చేరి ఎన్టీఆర్ కు కుడిభుజం అయ్యారు. శిక్షణ తరగతులు పేరిట పార్టీ శ్రేణులకు దగ్గరయ్యేసరికి ఎన్టీఆర్ మురిసిపోయారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నట్టు భ్రమించారు. కానీ అదే చంద్రబాబుకు ఆయుధంగా మారుతుందని అస్సలు ఊహించలేదు. అదే పార్టీని టేకోవర్ చేసుకొని తనను వీధిన పడేస్తాడని భావించలేదు.
ఎన్టీఆర్ తో ప్రారంభమైన చంద్రబాబు బాధితులు నందమూరి కుటుంబంలో పెరిగిపోయారు. లక్ష్మీపార్వతిపై ఉన్న ధ్వేషంతో నందమూరి కుటుంబాన్ని తన గుప్పెట్లో ఉంచుకోగలిగారు చంద్రబాబు. ఎన్టీఆర్ కడుపున పుట్టిన బిడ్డలే తండ్రిని కాదనలే చతురత ప్రదర్శించారు. వారితోనే తిరుగుబాటు చేయించారు. తరువాత నందమూరి హరికృష్ణను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఒక పద్ధతి ప్రకారం పార్టీ నుంచి బయటకు పంపించారు. బాలక్రిష్ణ కుమార్తెను కోడలిని చేసుకొని మరో బంధానికి తెరతీశారు. బాలక్రిష్ణను కబంధ హస్తల్లో పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు బాధితుల్లో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి సుహాసిని, నందమూరి తారకరత్న ఇలా అందరూ ఉన్నారు.
అయితే నందమూరి వంశంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబు కుటిల ఆలోచనల్ని కనిపెట్టి దూరంగా వెళ్లిపోయాడు. 2009 ఎన్నికల్లో ఊరూవాడ ప్రచారం చేసి చంద్రబాబును గెలిపించాలని కోరాడు. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చేసరికి తారక్ ను చంద్రబాబు సైడ్: చేశాడు. కనీసం పలుకరించిన పాపాన పోలేదు. పోనీ 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత పిలిచారంటే అదీ లేదు. కనీసం మాట వరసకైనా ఆహ్వానించలేదు. ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబుకి అందరి కంటే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఆ దిశగా మళ్లీ పావులు కదిపాడు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. కానీ చంద్రబాబు రాజకీయాలు తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ముందస్తు కార్యక్రమాల పేరిట సైడయిపోయాడు. చంద్రబాబు వ్యూహాల కంటే ముందుగా ఆలోచించి పద్ధతి ప్రకారం సైడయ్యాడు. చంద్రబాబు పాచికలు పారవని హెచ్చరికలు పంపాడు.