Good News for AP Unemployed : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

ఏపీలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర శిక్ష సొసైటీ పరిధిలోని కస్తూర్భా బాలిక విద్యాలయాల్లో ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ భర్తీకి సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు సైతం భర్తీ చేయనున్నారు.

Written By: Dharma, Updated On : May 29, 2023 3:00 pm
Follow us on

Good News for AP Unemployed : నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర శిక్ష సొసైటీ పరిధిలోని కస్తూర్భా బాలిక విద్యాలయాల్లో ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ భర్తీకి సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు సైతం భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం 1358 పోస్టులకుగాను నియామక ప్రక్రియ చేపడుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామక ప్రక్రియ జరగనుంది. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 4 రాత్రి 11.59 వరకూ గడువు ఉంది.

కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.జనరల్‌ అభ్యర్థులకు 18- నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ,  బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.100. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. రోస్టర్ పద్ధతిలో నియామక ప్రక్రియ ఉంటుంది.

మొత్తం 1358 పోస్టులు భర్తీ చేయనున్నారు.ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ 846,  సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి  ప్రిన్సిపాళ్లకు రూ.34,139, సీఆర్టీలకు రూ.26,759, పీజీటీలకు రూ.26,759, పీఈటీలకు రూ.26,759 చొప్పున  నెలకు గౌరవ వేతనం అందిస్తారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.