Harirama Jogaiah: జనసేన అధినేత పవన్ పై తిరుగుబాటు ప్రారంభమైంది. జనసేనకు పొత్తులో భాగంగా అతి తక్కువ సీట్లు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, కాపు సంఘాల నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జనసేనకు 50 అసెంబ్లీ సీట్లకు పైగా కేటాయించాలన్నది డిమాండ్. అటు సీఎం పదవిలో షేరింగ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తన బలానికి తగ్గట్టు మాత్రమే పోటీ చేస్తామని పవన్ ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. తప్పకుండా జన సైనికులు సంతృప్తి చెందేలా సీట్లు పొందుతామని కూడా పవన్ చాలా సందర్భాల్లో ప్రకటించారు. కానీ 175 స్థానాల్లో కేవలం 24 సీట్లు జనసేనకు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సీట్ల విషయంలో పవన్ తీరును తప్పుపడుతున్నారు. ఇలా అయితే కాపులకు రాజ్యాధికారం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది జనసేన ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగ్గంపేటలో జనసేన ఆశావహుడు ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విలేకరుల ఎదుటే బోరున విలపించారు.ఈ పరిణామాల క్రమంలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి చేగొండి హరి రామ జోగయ్య స్పందించారు. పొత్తుల విషయంలో పవన్ వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. బాహటంగానే విమర్శలు కురిపించారు. గత కొద్దిరోజులుగా హరిరామ జోగయ్య పవన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో సింహభాగం ప్రయోజనాలు జనసేనకు దక్కాలని.. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత హరి రామ జోగయ్య తాజాగా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అవి వైరల్ గా మారాయి.
అసలు జనసేనకు 24 సీట్లు ఇవ్వడం ఏమిటని హరి రామ జోగయ్య ప్రశ్నించారు. ఇది సరైన నిర్ణయం కాదని తేల్చేశారు. ఈ విషయంపై పవన్ కు నేరుగా లేఖ రాశారు.’ పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహీ అని తీసుకోవడం ఒత్తు ధర్మం అనిపించుకోదు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా? చెరో రెండున్నర ఏళ్ళు సీఎం పదవి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి ‘ ఘాటుగా పవన్ కు లేఖ రాశారు. హరి రామ జోగయ్య తో పాటు కాపు సంఘం ప్రతినిధులు సైతం పొత్తుపై విభిన్నంగా స్పందిస్తున్నారు. జనసేనకు ఇన్ని తక్కువ సీట్లతో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై పవన్ స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని.. బలంగా ఉన్న వైసీపీని గద్దించాలంటే పొత్తు అనివార్యమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పొత్తుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.