YSR Congress: దమ్ముంటే సింగిల్ గా రండి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) స్లోగన్ ఇది. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమిగా వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించాయి. అయితే అది ఒక గెలుపేనా అన్నది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. దానికి కారణం మూడు పార్టీలు విడిగా వస్తే.. తామే బలవంతులమన్నది ఆ పార్టీ భావన. అయితే ఇప్పుడే కాదు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి తత్వం అదే. ఏ పార్టీతో కలవరు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరు. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు. ఇకనుంచి మరో ఎత్తు. 2024 ఎన్నికల వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. ఎప్పుడైతే దారుణ పరాజయం చవిచూసిందో అప్పటి నుంచే ఒక రకమైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఆ పార్టీలో ఒక మార్పు కనిపించింది. ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని హై కమాండ్ పిలిపించింది. దానికి అన్ని పార్టీలకు ఆహ్వానాలు అందాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది ఆ పార్టీ హై కమాండ్. అయితే ఆ పార్టీతో కలిసి వచ్చేది ఎవరు? అనేది చూడాలి.
జడ శ్రావణ్ ఒక్కరే అనుకూలం..
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్( Congress), వామపక్షాలు, అమ్ ఆద్మీ, బీఎస్పీ, బోడె రామచంద్ర యాదవ్ పార్టీ, జడ శ్రవణ్ కుమార్ పార్టీలు ఉన్నాయి. అయితే ఇందులో జడ శ్రావణ్ కుమార్ మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయన స్వయంగా పోటీ చేసిన వచ్చింది 70 ఓట్లు మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పోరాటాలు చేస్తారో తెలియంది కాదు. ఇప్పటికే చంద్రబాబు పట్టించుకోకపోవడంతో జడ శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డితో జతకట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేసేందుకు.. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేక ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన భవిష్యత్తులో పొత్తు కంటే ప్యాకేజీల వైపే మొగ్గు చూపుతారు అన్నది ఒక ఆరోపణ. ఆయన తప్ప మరొకరు ఇటువైపు చూసే అవకాశం లేదని తెలుస్తోంది.
వామపక్షాల ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం వామపక్షాలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). పైగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే క్రమంలో వారిని ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి ఉన్న.. ఆ పార్టీతో తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై వామపక్షాలకు ఉన్న అనుమానం. ఎప్పుడైతే బిజెపిని వ్యతిరేకిస్తారో అప్పుడే జగన్మోహన్ రెడ్డిని వామపక్షాలు నమ్మేది. అంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వామపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవు. అటు కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా జగన్ విషయంలో మారదు. అందుకే వామపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జత కలిసే అవకాశం లేదు.
మిగిలినవి ఆ రెండు పార్టీలే..
బోడె రామచంద్ర యాదవ్( Ramachandra Yadav) గట్టిగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా ఎదగాలని చూస్తున్నారు. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో జత కలిసే అవకాశం లేదు. ఆపై బీఎస్పీ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఉండే నాయకులు ఎవరో తెలియదు. అందుకే ఆ జండాలను అద్దెకు తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తుందన్నమాట. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో జతకలిసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి. సింహం సింగిల్ గా వస్తుంది అన్న మాటలు కూడా తేడా కొట్టాయి. ఆ ప్రభావం కూడా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కనిపిస్తోంది.