Expensive Fish Price 50000: వేసవిలో రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో.. మర బోటులతో సముద్రంలో చేపల వేట నిషేధం రెండు నెలల పాటు. మరపడవలతో వెళితే ఆ పరికరాలు తగిలి సంతానోత్పత్తికి ఇబ్బందులు కలుగుతాయని ఏటా ప్రభుత్వం రెండు నలల పాటు చేపల వేటను నిషేధిస్తూ వస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఇది కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా చేపల వేట నిషేధం పూర్తయింది. అయితే చాలా రోజుల తర్వాత సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు భారీగా మత్స్య సంపద చిక్కుతోంది. అరుదైన చేపలు సైతం చిక్కుతుండడంతో మత్స్యకారులకు ఉపాధి గిట్టుబాటు అవుతోంది. అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు అయితే లక్షల విలువచేసే మూడు అరుదైన చేపలు చిక్కాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ పరిధిలో..
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం లో మినీ ఫిషింగ్ హార్బర్ ఉంది. చేపల వేట నిషేధం గడువు ముగియడంతో మత్స్యకారులు వేటకు బయలుదేరారు. ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఆ మూడు చేపలను హార్బర్లో బహిరంగ వేలం వేశారు. స్థానిక వ్యాపారి ఒకరు లక్ష యాభై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. చేపలు అరుదుగా దొరకడం, వాటికి మార్కెట్లో మంచి ధర ఉండటంతో భారీ తరపు అమ్ముడైపోయాయి. అయితే ఈ చేపలు ఒక్కొక్కటి 12 నుంచి 13 కిలోల బరువు ఉన్నాయి. అందులో రెండు మగ చేపలు, మరొకటి ఆడ చేప. వీటిని వేలంలో దక్కించుకునేందుకు చాలామంది పోటీపడ్డారు. చివరకు ఓ వ్యాపారికి దక్కాయి.
కచిడి చేపలకు ప్రత్యేకత ఉంది. పొట్ట భాగంలో లభించే ప్రత్యేక పదార్థాన్ని కొన్ని ఔషధాలు తయారీలో వినియోగిస్తారు. అందుకే ఈ చేపలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు చిక్కితే.. ఒక్కొక్కటి రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఎగబడ్డ జనం..
కచిడి చేపలు చిక్కాయి అని తెలియడంతో పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో సందడి నెలకొంది. వాటిని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. వేట విరామం అనంతరం ఈ చేపలు చిక్కడం శుభపరిణామమని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక ఏడాది పొడవునా భారీగా మత్స్య సంపద చిక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేట నిషేధ సమయానికి గాను ప్రభుత్వం ప్రతి మత్స్యకారుడికి 20 వేల రూపాయల చొప్పున భృతి అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా భారీగా అందించింది. శ్రీకాకుళం జిల్లా డోంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు తీర ప్రాంతం విస్తరించి ఉంది. మత్స్యకారులు వేట రెండు నెలల పాటు వేటకు దూరంగా ఉంటారు. ఈ ఏడాది కూడా మొన్ననే వేట విరామ సమయం ముగిసింది. దీంతో చేపల వేట ప్రారంభం అయింది. అరుదైన చేపలు చిక్కుతుండడంతో మత్స్యకారులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.
