Tesla Car Safety Controversy: టెస్లా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ. ఈ సంస్థే ఆయనను 3 ట్రిలియన్ డాలర్ల సంపదకు అధిపతిని చేసింది. ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రానిక్ కార్లు తయారు చేసే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఈ కంపెనీ కార్ల సేఫ్టీపై సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఒక టెస్లా కారు ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా స్వయంచాలక వాహనాల భద్రత, సాంకేతికత సామర్థ్యం, ప్రమాదాల్లో బాధ్యత ఎవరిది అనే అంశాలపై తీవ్ర చర్చలను రాజేసింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు నియంత్రణ తప్పి అతివేగంతో ఒక ఇంటిలోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మార్తా అవిలా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్వయంచాలక డ్రైవింగ్ సాంకేతికత ఎంత ముందుకు వెళ్లిందో, అంతే భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని స్పష్టం చేస్తోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
టెస్లా కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్‌లో పనిచేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయి అధిక వేగంతో నేరుగా ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు మార్తా అవిలా తీవ్రంగా గాయపడి మరణించింది. డ్రైవర్ లెస్ వాహనాలు మానవ లోపాలను తగ్గించేందుకు రూపొందించబడినప్పటికీ, ఈ ఘటన సాంకేతిక వ్యవస్థలు కూడా విఫలం కావచ్చని రుజువు చేసింది.
సెల్ఫ్ డ్రైవింగ్ డేంజరే..
సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు మానవ డ్రైవర్లలో సాధారణంగా కనిపించే అలసట, దృష్టి మరలడం, తప్పు నిర్ణయాల వంటి లోపాలను తగ్గించడానికి రూపొందించబడ్డాయి. కెమెరాలు, సెన్సార్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు వాహనాన్ని స్వయంగా నడిపేందుకు సహాయపడతాయి. అయితే, ఈ వ్యవస్థలు పూర్తిగా లోపరహితంగా ఉండవు. సాఫ్ట్‌వేర్ బగ్స్, సెన్సార్ వైఫల్యాలు లేదా అనుకోని పరిస్థితుల్లో వ్యవస్థ నిర్ణయాలు తప్పు దారిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఆ వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది.
బాధ్యత ఎవరిది?
సాధారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్‌ను బాధ్యులను చేస్తారు. అరెస్టు చేస్తారు. సెల్ప్ డ్రైవింగ్ కారు కారణంగా ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత ఎవరిది అనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్నగా మారింది. డ్రైవర్‌కు బాధ్యత ఉందా? (సెమీ–ఆటోమేటెడ్ మోడ్‌లో డ్రైవర్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి), వాహన తయారీదారు (టెస్లా)కు బాధ్యత ఉందా? (సాఫ్ట్‌వేర్ లోపం ఉంటే), లేక ఇద్దరూ బాధ్యత వహించాలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో చట్టాలు ఇంకా స్పష్టంగా లేవు. ఈ ఘటన తర్వాత చట్టపరమైన సంస్కరణలు, బీమా నియమాలు, తయారీదారుల బాధ్యతను నిర్వచించే కొత్త రూల్స్ అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐదేళ్లలో 3,866 ప్రమాదాలు..
2021 నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కారణంగా 3,866 ప్రమాదాలు జరిగాయి. ఈ సంఖ్య సాంకేతికత ఇంకా పూర్తి స్థాయిలో సురక్షితంగా లేదని, మరింత కఠినమైన టెస్టింగ్, రియల్ వరల్డ్ డేటా విశ్లేషణ అవసరమని సూచిస్తోంది. ఒక్కో ప్రమాదం నుంచి నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరచడం అవసరం, కానీ ప్రతి ఘటనతో ప్రజల నమ్మకం క్షీణిస్తుంది.
నెట్టింట్లో చర్చ…
ఈ ప్రమాదం తర్వాత సోషల్ మీడియా, న్యూస్ ప్లాట్‌ఫామ్‌లపై వేడి చర్చలు మొదలయ్యాయి. కొందరు ‘స్వయంచాలక వాహనాలు ఇంకా సురక్షితం కావాలి, పూర్తి నియంత్రణ ఇవ్వకూడదు’ అంటున్నారు. మరికొందరు ‘మానవ డ్రైవర్ల కంటే ఇవి ఎంతో సురక్షితం, కేవలం ఒక్క ఘటనతో వ్యతిరేకించకూడదు’ అని వాదిస్తున్నారు. బాధ్యత, బీమా, ప్రభుత్వ నియంత్రణలు వంటి అంశాలపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ భద్రతను మొదటి ప్రాధాన్యతగా ఉంచి, బాధ్యతను సరిగ్గా నిర్వచించినప్పుడే ఈ వాహనాలు నిజంగా సురక్షితంగా మారతాయి. భద్రత, బాధ్యత, నియంత్రణలు సమతుల్యంగా ఉంటేనే భవిష్యత్తులో ఈ సాంకేతికత ప్రజల నమ్మకాన్ని సంపాదించగలుగుతుంది.
