Kadapa Politics: కడప జిల్లా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వైయస్ కుటుంబంలో ఎవరి వైపు నిలబడాలో తెలియక నడి జంక్షన్లో నిలబడ్డారు. బాబాయ్ వివేక చంపిన వాడికి ఓటు వేస్తారా? లేకుంటే వైఎస్ బిడ్డకు వేస్తారా? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. బాబాయ్ వివేకాను ఎవరు చంపారో? ఆ దేవుడికి తెలుసు. లేకుంటే ఈ జిల్లా ప్రజలకు తెలుసునని.. చంపిన వ్యక్తులకు ఎవరు అండగా నిలుస్తున్నారో.. ప్రత్యర్థులతో ఎవరు చేతులు కలిపారో అంటూ వైఎస్ షర్మిల, సునీతను టార్గెట్ చేసుకుని జగన్ మాట్లాడారు. వైసీపీకి ఓటు వేయాలని జిల్లా ప్రజలను కోరారు. అయితే తాము అభిమానించిన రాజశేఖర్ రెడ్డి కుమార్తె అలా.. కుమారుడు ఇలా ఉండడంతో కడప జిల్లా ప్రజలు అయోమయంలో పడుతున్నారు. ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబం అంటేనే కడప జిల్లా అన్న రేంజిలో బంధం పెనవేసుకుంది. నాలుగున్నర దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. వైఎస్ తర్వాత ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి పై కడప ప్రజలు అభిమానం చూపించారు. గత ఎన్నికలకు ముందు వివేకా దారుణ హత్యకు గురయ్యారు. అది రాజకీయ ప్రత్యర్థులు చేశారన్న ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే వైసీపీని ఏకపక్షంగా గెలిపించారు. కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీకి అప్పగించారు. అయితే ఎన్నికల అనంతరం సీన్ మారింది. వివేకా హత్యలో అసలు నిందితుల పేర్లు బయటపడ్డాయి. వైయస్ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అంటూ సిబిఐ సైతం స్పష్టం చేసింది. వివేక కుటుంబంతో పాటు జగన్ సోదరి షర్మిల సైతంఅవినాష్ రెడ్డి పైనే ఆరోపణలు చేశారు. నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఈ వివేక హత్య నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పైనే షర్మిల పోటీకి దిగారు.
అయితే కేవలం వివేక హత్య కేసు అజెండాతోనే షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇదో రెఫరండంగా తీసుకుంటున్నారు. కడప జిల్లా ఓటర్లకు తాను స్పష్టమైన సూచన చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడు ఒకవైపు.. మీ రాజన్న బిడ్డ మరోవైపు.. తేల్చుకోవాల్సింది మీరేనంటూ షర్మిల ఇస్తున్న పిలుపు కడప జిల్లా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది వైసీపీ శ్రేణులకు కలవరపాటుకు కారణమవుతోంది. పోటీ చేస్తున్న వ్యక్తితో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్ ను సైతం ఓడించాలని షర్మిల ప్రజలకు పిలుపునిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు జిల్లాలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. అటు షర్మిలను అభిమానించే నేతలు అధికార పార్టీలోనే అధికంగా ఉన్నారు. అటువంటి వారికి వాస్తవాలు తెలుసు. వారు ఎన్నికల్లో తప్పకుండా షర్మిల కి అండగా నిలబడతారు. కానీ ఇన్నాళ్లు వైసీపీని తమ పార్టీగా, జగన్ ను తమ నాయకుడిగా చూసుకున్న వారు షర్మిల వైపు వచ్చేందుకు సంశయిస్తున్నారు. అయితే ఈ పరిణామాలను విపక్ష కూటమి అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. షర్మిల ఎంతగా గట్టిగా మాట్లాడితే.. వైసిపి ఓట్లు చీలి కాంగ్రెస్ వైపు వెళ్తాయని.. విపక్ష కూటమికి ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి.