Jagan: గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. తెర ముందు అనేకమంది.. తెర వెనుక ఇంకొంతమంది పనిచేశారు. వైఎస్ కుటుంబమంతా ఏకతాటిపై నిలిచింది. జగన్ కు వన్ ఛాన్స్ అంటూ కోరడంతో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఐదేళ్ల కాలంలో తన కోసం పని చేసిన వారు, తన వారిని జగన్ దూరం చేసుకున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి చాలామంది స్టార్ క్యాంపెయినర్లు పని చేయగా.. ఇప్పుడైతే మాత్రం జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్ గా మిగిలారు. ఒంటరి పోరు చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు దూరం కావడం జగన్ కు లోటే.
జగన్ ను గెలిపించడానికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు. రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్ ల గురించి చెప్పనవసరం లేదు. మరోవైపు కుల రాజకీయాల బ్యాచ్ ఒకటి ఉండేది. ఇంకో బృందం అమరావతి పై విషం చిమ్మిది. దీంతో జగన్ ప్రచారం చేయకుండానే వైసీపీకి ఎనలేని ప్రాచుర్యం దక్కింది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన కోసం తల్లి ప్రచారం చేయడం లేదు. చెల్లి ప్రచారం చేయడం లేదు. చెల్లి షర్మిల రివర్స్ అయ్యారు. అన్న జగన్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తల్లి విజయమ్మ ఆశీర్వాదానికి పరిమితమయ్యారు. తనకు అండగా నిలబడిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు జగన్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వడంతో కక్కలేక మింగలేక వారు సైలెంట్ అయ్యారు. అజయ కల్లాం లాంటి విశ్వాసం గల అధికారులకు వివేక హత్య కేసు విషయంలో పావుగా మార్చుకున్నారు.
పోనీ సినిమా యాక్టర్లైనా మద్దతుగా నిలుస్తున్నారంటే అది లేదు. వారికి సినిమా అంతా అర్ధమయ్యింది. అందుకే ఎవరికి వారు పక్కకు తప్పుకుంటున్నారు. మోహన్ బాబు ఎప్పుడో సైలెంట్ అయ్యారు. జగన్ కు నమస్కారం పెట్టేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేనలోకి వెళ్లిపోయారు. ఆలీ చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. పోసాని కృష్ణ మురళి అప్పుడప్పుడు బయటకు వచ్చి.. తన పని తాను చేసుకుంటున్నారు.విపక్షంలో ఉన్నప్పుడు కలిసి వచ్చిన కాలం, కలిసొచ్చిన కుటుంబం, కలిసి నడిచిన నాయకులు.. ఇలా అందరూ దూరమయ్యారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే జగన్ వెంట నడుస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా కనిపించిన వైయస్ కుటుంబం.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్ఛిన్నం అయ్యింది. జగన్ ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన కుటుంబం ఆయనకు దూరమైంది. కుటుంబాన్ని దూరం చేసుకుని.. ఏపీ ప్రజలు దగ్గరగా ఉన్నారని జగన్ సంతృప్తి చెందుతున్నారు. కానీ ఒంటరినయ్యానని మాత్రం జగన్ భావించడం లేదు. అయితే తెలిసినటిస్తున్నారో.. తెలియనితనమో తెలియదు కానీ.. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం తాను వేసిన తప్పటడుగులు తెలిసే అవకాశం ఉంది. అదే మంచి ఫలితం సాధిస్తే మాత్రం.. దానికి వ్యూహం అనే పేరు పెట్టి జగన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ప్లాన్ చేస్తారు.