NTV Narendra Chowdary vs TV5 BR Naidu: రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. మీడియా అధిపతులు కూడా తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు. తెలుగు నాట మీడియా అధిపతుల మధ్య సమరం గతంలో బయట ప్రపంచానికి అంతగా తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మీడియా అధిపతుల మధ్య ఉన్న సమరం తెలుస్తోంది. తెలుగులో అధికార పార్టీకి.. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా భుజాలు కాసే మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. ఉదయం వేస్తే చాలు వారి మీద వీరు.. వీరి మీద వారు బురద చల్లుకోవడం పరిపాటిగా మారింది. తమిళనాడులో మాత్రమే ఒకప్పుడు మీడియా మధ్య ఇలాంటి విభజన రేఖలు ఉండేవి. ఇప్పుడు తెలుగులో అంతకుమించి అనే స్థాయిలో ఆ విభజన రేఖలు పెరిగిపోయాయి.
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి వర్గాన్ని టీవీ5 బిఆర్ నాయుడు కుమారుడు రవీంద్రనాథ్ ఓడించారు. రవీంద్రనాథ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021లో సొసైటీకి ఎన్నికలు జరిగాయి. నాడు జరిగిన ఎన్నికలలో నరేంద్ర చౌదరి అనేక రకాలుగా అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రనాథ్ ఆరోపించారు. తద్వారా గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీవీ5 వర్సెస్ ఎన్ టివి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
Also Read: నారా లోకేష్ కి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇలా మాట్లాడాలంటే గట్స్ ఉండాలి..
ఇటీవల రవీంద్రనాథ్ వర్గం సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. ఇటీవల కాలంలో నరేంద్ర చౌదరి వర్గం రవీంద్రనాథ్ వర్గం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ క్రమంలో నరేంద్ర చౌదరి వర్గం చేస్తున్న విమర్శలను బయట పెట్టాలని.. చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని రవీంద్రనాథ్ వర్గం డిమాండ్ చేసింది. డిబేట్ కార్యక్రమానికి భారీగా మీడియా ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ.. ఎన్ టివి కి మాత్రం ఆహ్వానం పంపించలేదు. మరోవైపు రవీంద్రనాథ్ బాగోతాలను మొత్తం బయట పెడతామని నరేంద్ర చౌదరి వర్గం చెబుతోంది. హైదరాబాదులో ఉన్న ఏ ప్రెస్ క్లబ్ లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది.
ఈసారి జరిగే ఎన్నికల్లో నరేంద్ర చౌదరి తన వర్గం నుంచి బొల్లినేని శీనయ్యను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. శీనయ్యను అధ్యక్షుడిగా చేయాలని నరేంద్ర చౌదరి బలంగా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. శీనయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. జాతీయస్థాయిలో పేరు మోసిన బిల్డర్ గా గుర్తింపు పొందారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీ ఆర్ నాయుడు వర్గం నుంచి రవీంద్రనాథ్ మళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు టివి5 వర్సెస్ ఎన్టీవీ అన్నట్టుగా మారిపోతాయని.. గతానికి మించి ఈసారి సభ్యులకు తాయిలాలు రెండు వైపులా నుంచి లభిస్తాయని తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు మించి ఈ ఎన్నికలు జరుగుతాయని.. ఖర్చు కూడా ఒక రేంజ్ లో ఉంటుందని అక్కడి సొసైటీ సభ్యులు చెబుతున్నారు.