Sajeeva Charitra Book Launched: నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న కాలంలో ఆ పార్టీకి ఎదురెళ్లిన యోధుడు. ఢిల్లీ రాజకీయాలను షేక్ చేసిన నేత కూడా. ఆయన ప్రతి అడుగు అప్పట్లో ప్రభంజనమే. అలా 1982లో పార్టీని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. కానీ అప్పటికే దశాబ్దాల రాజకీయాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీని కబళించేందుకు ప్రయత్నం చేసింది. నందమూరి తారకరామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించి హస్త గతం చేసుకుంది. కానీ నాడు ఉమ్మడి ఏపీవ్యాప్తంగా ప్రజలు నందమూరి తారక రామారావు కు అండగా నిలిచారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ వెంట నిలిచాయి. మళ్లీ ఎన్టీఆర్ చేతికి సీఎం పదవి వచ్చింది. అయితే నాడు కాంగ్రెస్ అహంకారానికి చెక్ పెట్టాలని భావించారు నందమూరి తారక రామారావు. శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. నాటి చరిత్రను గుర్తు చేసుకుంటూ ఈరోజు సజీవ సాక్ష్యం ఓ పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.
* అనూహ్యంగా ప్రజా తీర్పు కోసం..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో ఆ పార్టీ కుటిల తత్వాన్ని గుర్తించారు ఎన్టీఆర్. అందుకే మళ్ళీ ప్రజల తీర్పు కోరాలని భావించారు. 1985 నవంబర్లో శాసనసభను రద్దుచేస్తూ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శంకర్ దయాల్ శర్మకు పంపించారు. ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో ఎన్నికలు వచ్చాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో సిపిఐ, సిపిఎం, జనతా పార్టీలను మిత్రులుగా చేసుకుని సీట్ల సర్దుబాటు చేసుకున్నారు నందమూరి తారక రామారావు. 1985లో జరిగిన మద్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది.
* 275 సీట్లకు గాను 250 చోట్ల పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. 202 సీట్లలో విజయం సాధించింది.
* 290 స్థానాలకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 50 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.
* 12 స్థానాల్లో పోటీ చేసిన సిపిఎం 11చోట్ల గెలిచింది.
* 15 స్థానాల్లో పోటీ చేసిన సిపిఐ 11చోట్ల విజయం సాధించింది.
* బిజెపి 10 స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాలు గెలిచింది. జనతా పార్టీ సైతం మూడు స్థానాలను గెల్చుకుంది.
* ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మూడోసారి పదవీ ప్రమాణం చేశారు నందమూరి తారక రామారావు. ప్రతిపక్ష నేతగా బాగా రెడ్డి ఎన్నికయ్యారు. సిపిఎం పక్ష నేతగా నర్రా రాఘవరెడ్డి, సిపిఐ పక్ష నేతగా చెన్నమనేని రాజేశ్వరరావు ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నందమూరి తారకరామారావు శాసనమండలిని రద్దు చేశారు. ఇలా ఎన్నో రకాల సంచలనాలకు చిరునామాగా నిలిచారు నందమూరి తారకరామారావు.
* నేడు పుస్తకావిష్కరణ..
అందుకే నాటి సంగతులను గుర్తు చేస్తూ సజీవ చరిత్ర పేరిట టిడిపి నేత డిడి జనార్ధన్ రాసిన.. విక్రమ్ పూల రచించిన ఈ పుస్తకాన్ని ఈరోజు విజయవాడలో ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం హాజరుకానున్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్టీఆర్ మళ్లీ సీఎం గా ఎలా తిరిగి వచ్చారో విశ్లేషించారు టీడీ జనార్ధన్.