Ap Liquer Policy : జే బ్రాండ్స్ కు చెక్.. కొద్ది గంటల్లో బ్రాండెడ్ మద్యం.. దుకాణాలు దక్కేది వీరికే!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీలో జే బ్రాండ్స్ మద్యం విచ్చలవిడిగా చలామణి అయ్యింది. దేశంలో ఎక్కడా చూడని మద్యం.. ఏపీ ప్రభుత్వ దుకాణాల్లో కనిపించేది. కానీ మరికొద్ది గంటల్లో ఈ జె బ్రాండ్ మద్యం కనుమరుగు కానుంది. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.

Written By: Dharma, Updated On : October 14, 2024 12:32 pm

Ap Liquer Policy

Follow us on

Ap Liquer Policy :  ఏపీలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపులకు సంబంధించి లైసెన్సులు ఈరోజు జారీ కానున్నాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు అయిన సంగతి తెలిసిందే.మళ్లీ పాత విధానంలో ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల ఒకటి నుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 11 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుము ద్వారా ప్రభుత్వానికి 1798 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు. ఈరోజు లాటరీ తీయనున్నారు. లాటరీలో షాపులు దక్కించుకున్న వారు ఈనెల 16 నుంచి కొత్త షాపులు ప్రారంభించాల్సి ఉంటుంది. తాము గెలిస్తే బ్రాండెడ్ మద్యం అందించడంతోపాటు పాత ధరలకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని ఇప్పుడు చంద్రబాబు అమలు చేశారు. ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుతో పాటు వాటి ధరలను సైతం తగ్గించారు. దాదాపు అన్ని ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.

* దేశంలో ఎక్కడా చూడని బ్రాండ్లు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మద్యం పాలసీలను ప్రకటించింది. ప్రభుత్వమే సొంతంగా దుకాణాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. అంతకుముందున్న ధరకు 100% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అయితే ప్రీమియం బ్రాండ్లు షాపుల్లో కనిపించకుండా మానేశాయి. దేశంలో ఎక్కడా వినని, చూడని బ్రాండ్లు కనిపించాయి. వాటితో ప్రజారోగ్యానికి భంగం వాటిల్లుతోందని ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా జగన్ సర్కార్ వినలేదు. కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేటు మద్యం బ్రాండ్లను తెచ్చారని ఆరోపణలు వినిపించాయి. రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉందంటూవిపక్షాలు ఎద్దేవా చేశాయి.అయినా సరే జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. అవే బ్రాండ్లను కొనసాగించింది.

* వైసీపీకి శాపంగా మారిన..
వైసిపికి మద్యం పాలసీ శాపంగా మారింది. మద్యం ధరలు పెంచడంతో పాటు లేనిపోని బ్రాండ్లను అందుబాటులోకి తేవడంపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదే విషయాన్ని గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకు మద్యం అందించడంతో పాటు పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు క్వార్టర్ మద్యం కనిష్ట ధర 99 రూపాయలుగా నిర్ణయించారు. దాదాపు పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డిసైడ్ అయ్యారు. మరో 36 గంటల్లో ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. మనదేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎంఆర్పి ధరపై అదనపు ప్రివిలేజ్ విధిస్తూ సవరణ చేసింది ప్రభుత్వం. అదనపురి విలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలు చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేసింది. ఉదాహరణకు ఒక క్వార్టర్ మద్యం ధర 150.50 ఉంటే దానికి పది రూపాయలు పెంచుతూ 160 రూపాయలు చేయనున్నారు. మొత్తానికైతే మరో కొద్ది గంటల్లో అన్ని రకాల బ్రాండ్ల మద్యం రానుండడం విశేషం.