65 YCP Sittings  : వైసీపీలో ఆ 65 మంది సిట్టింగులకు నో చాన్స్

తప్పకుండా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాగని వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు కంటిన్యూ చేసినా ఓటమి తప్పదన్న నివేదికలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకుపోవాలో వైసీపీ హైకమాండ్ కు పాలుపోవడం లేదు.

Written By: Dharma, Updated On : June 1, 2023 9:15 am
Follow us on

65 YCP Sittings  : వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మంది సిట్టింగులకు ఉద్వాసన తప్పదా? వారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారా? వారిని మార్చకుంటే ఓటమి తప్పదని హైకమాండ్ గుర్తించిందా? అందుకే వారిని పక్కకు తప్పించాలని చూస్తోందా? దాదాపు 65 మందిని మార్చే ప్రయత్నంలో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో 151 మెజార్టీతో ప్రజలు వైసీపీకి పీఠం ఇచ్చారు. కానీ గ్రౌండ్ లెవల్ లో ఎమ్మెల్యేలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని మార్చాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.  హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది.

ఇటీవల ప్రశాంత్ కిశోర్ ఏపీకి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ తో రహస్య సమావేశమై ఒక నివేదికను పెట్టినట్టు సమాచారం. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల వరకూ మార్చకుంటే ప్రతికూల ఫలితాలు వచ్చే చాన్స్ ఉందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే అది 40 సంఖ్యతో ఆగలేదని.. 65 మంది సిట్టింగులకు మార్చకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని పీకే హెచ్చరించినట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. 13 ఉమ్మడి జిల్లాలకుగాను.. జిల్లాకు ఐదుగురి చొప్పున మార్చితేనే ఫలితాలు సానుకూలంగా మారే అవకాశమున్నట్టు పీకే హెచ్చరించినట్టు సమాచారం.

పెద్దఎత్తున సిట్టింగులను మార్చడం అంటే సాహసంతో కూడుకున్న పనే. అందుకే దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న కర్నాటకలో బీజేపీ ఇటువంటి సాహసమే చేసింది. చాలామంది సిట్టింగులకు, సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. చివరికి సీఎంగా పనిచేసిన జగదీష్ షెట్టర్ వంటి సీనియర్ ని పక్కన పెట్టేసింది. అది ప్రతికూలతగా మారింది. బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. కొందరు రెబల్ గా దిగారు. మరికొందరు పక్క పార్టీల్లో చేరిపోయారు. అది అంతిమంగా బీజేపీకి దెబ్బకొట్టింది.

ప్రస్తుతం ఉన్న సిట్టింగులకు నియోజకవర్గంలో 5 నుంచి 10 వేల వరకూ సొంత ఓటింగ్ ఉంటుంది. వారిని తప్పిస్తే మాత్రం వారు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. తప్పకుండా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాగని వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు కంటిన్యూ చేసినా ఓటమి తప్పదన్న నివేదికలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకుపోవాలో వైసీపీ హైకమాండ్ కు పాలుపోవడం లేదు. అందుకే వీలైనంత వరకూ ప్రత్యామ్నాయంగా బలమైన అభ్యర్థిని తయారుచేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇది కేవలం సీఎం క్లోజ్ సర్కిల్ వ్యక్తులకు పని పురమాయించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?