Homeఆంధ్రప్రదేశ్‌Central budget : ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ.. అమరావతికి రూ.15 వేలకోట్లు..పోలవరానికి కూడా

Central budget : ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ.. అమరావతికి రూ.15 వేలకోట్లు..పోలవరానికి కూడా

Central budget : అమరావతికి మరో శుభవార్త.రాజధాని నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇతోధికంగా సాయం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన చేసింది. ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఏపీకి సంబంధించి కీలక రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని స్వయంగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం విశేషం. దీంతో ఇది అమరావతికి ఊపిరి పోసినట్టే. ఏపీ ప్రజల ఆశలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించడం విశేషం.

* ఐదేళ్లుగా ఎడతెగని జాప్యం
గత ఐదు సంవత్సరాలుగా రాజధాని విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. అంతకుముందు ఎంపిక చేసిన అమరావతిని కాదని.. జగన్ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసింది. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించింది. కర్నూలు న్యాయ రాజధాని చేసింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. అలాగని అమరావతిని అభివృద్ధి చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి స్మశానంలా మార్చింది. 33,000 మంది రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది.పైగా అమరావతి రైతుల ప్రజాస్వామ్య పోరాటాలను సైతం జగన్ సర్కార్ ఉక్కు పాదంతో అణచివేసింది. అమరావతిని అభివృద్ధి చేయకపోగా.. మూడు రాజధానులు సైతం కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా రాజధాని లేని రాష్ట్రం గా ఏపీ మారింది.

* కూటమి రాకతో ఉపశమనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతికి కొత్త కళ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర నిర్లక్ష్యంతో అమరావతి చిట్టడవిలా మారింది. కీలక నిర్మాణాలు నీటిలో ఉండిపోయాయి. రహదారుల్లో ముళ్లపొదలు,చెత్త పేరుకుపోయింది.ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం.. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 100 జేసీబీలతో.. వందలాది వాహనాల సాయంతో ప్రాథమికంగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. విద్యుత్ దీపాలను వెలిగించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం చేసినరోజు అమరావతికొత్త కళతో కనిపించింది. అమరావతిని యధా స్థానానికి తెప్పించేందుకు దాదాపు 33 కోట్ల రూపాయలతో.. పూర్తిస్థాయిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ సైతం చేపట్టారు. 45 రోజుల లక్ష్యంతో పనులు ప్రారంభించనున్నారు. ఇంతలో ఐకానిక్ నిర్మాణాల విషయంలో.. ప్రస్తుత స్థితిని తెలియజేసేందుకు సీఆర్డీఏ అధికారుల బృందం ప్రత్యేక పరిశీలన చేసింది. ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదించనుంది.

* కార్యకలాపాలు ప్రారంభం
మరోవైపు అమరావతిలో భూములు దక్కించుకున్న పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి. విదేశీ సంస్థలు సైతం క్యూ కడుతున్నాయి. వాటికి భూకేటాయింపులు సైతం చేయనున్నారు. పాత వాటికి స్థలాలను సమకూర్చనున్నారు. చాలా సంస్థలు అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వాటికి సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతలో సాధ్యమైనంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారు. అవి ఇప్పుడు వర్క్ అవుట్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి.

* కేంద్రానికి చంద్రబాబు విన్నపం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది.ఆ పార్టీ మద్దతు ఇప్పుడు అవసరం. అయితే అది రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు బలంగా డిసైడ్ అయ్యారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు. రెవెన్యూ లోటు భర్తీకి సైతం కేంద్రం నుంచి సాయాన్ని ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు చంద్రబాబు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు 50 వేల కోట్ల రూపాయలు అడిగినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12 వేల కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి పదివేల కోట్లు చంద్రబాబు అడిగినట్లు ఆ మధ్యన టాక్ నడిచింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చారు. ఇది ఒక విధంగా ఏపీ ప్రజలకు శుభవార్త.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version