
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తనను ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేదిలేదని స్పష్టం చేసిందని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించిందని తన పిటీషన్ లో పేర్కొన్నారు.
నిమ్మగడ్డ తరపున లాయర్ అశ్వనీ కుమార్ ఈ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శిలను ప్రతివాదులుగా రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కలిసిన సంఘటన ఈ విషయంలో రాజకీయంగా వేడి రాజేసింది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!
రాజకీయ నాయకులతో నిమ్మగడ్డ భేటీనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన సీసీ టివి పుటేజ్ లను కోర్టుకు ఇవ్వడం, ఆయనకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలను, ఒక పార్టీకి లబ్ధిచేకూరే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తెచ్చి కేసునుంచి గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ, కామినేని, సుజనా చౌదరి భేటీ అంశం హైకోర్టులో నిలబడదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఏమి జరుగుతుందనేది విచారణ వరకూ వేచి చూడాల్సిందే.