TDP: ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి సైతం తమతో కలిసి వస్తోందని భావిస్తోంది. కానీ బిజెపి నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ప్రతికూల ఫలితాలు రావడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తామని బిజెపి ప్రకటించింది. దీంతో ఏపీలో సైతం బిజెపి వ్యవహార శైలి ఏంటన్నది స్పష్టత లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో అధికార వైసీపీని ఢీకొట్టాలంటే బిజెపి అవసరం ఉందని టిడిపి,జనసేన భావిస్తోంది.ఒకవేళ బిజెపి తమతో కలిసి రాకుంటే మిగతా రాజకీయ పక్షాలతో ముందుకెళ్లాలని ఈ రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో అయితే వైసీపీ దూకుడుగా ఉంది. అన్ని రాజకీయ పక్షాలకు ప్రత్యర్థిగా మారింది. జగన్ విధానాలను కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ బిజెపి రాకుంటే తాము సిద్ధంగా ఉన్నట్లు వామపక్షాలతో పాటు కాంగ్రెస్ సంకేతాలు ఇస్తోంది. అయితే జనసేన ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు ఆలోచించుకుని చంద్రబాబు సైతం బిజెపి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన బిజెపితో శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం లేదు. ఒకవేళ బిజెపి స్తబ్దుగా ఉంటే మాత్రం.. కాంగ్రెస్, వామపక్షాలను దగ్గర చేసుకుంటారని టాక్ నడుస్తోంది.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని పార్టీలు వైసీపీని వ్యతిరేకిస్తుండడం విశేషం.ఇప్పటికే ఈ చిన్నపాటి కార్యక్రమమైనా, ప్రభుత్వ వైఫల్యాల పైనా టిడిపి, జనసేన చేపడుతున్న నిరసనలకు వామపక్షాలు సైతం మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విషయంలో జరిగిన వివాదంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడం విశేషం. స్వాతంత్ర్యం ముందు నుంచే విజయవాడలోని ఓ భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. అయితే అది దేవాదాయ శాఖకు చెందినదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నెలరోజులపాటు కోర్టు గడువు ఇచ్చింది.
అయితే ఇంతలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి టిడిపి, జనసేన, వామపక్షాలు మద్దతు తెలపడం విశేషం. బిజెపి రాకుంటే మిగతా రాజకీయ పక్షాలు సిద్ధంగా ఉన్నట్లు ఈ కార్యక్రమం ద్వారా సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. బిజెపి అనుసరించే విధానాల బట్టి మిగతా రాజకీయ పక్షాలు పావులు కదిపే అవకాశం ఉంది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.