Chandrababu: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.గెలుపు గుర్రాలను వెతుకుతోంది. ఇప్పటికే జనసేనతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది.బిజెపి సైతం కూటమిలో చేరుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.అందుకే ఈసారి టిక్కెట్ల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమేనని తేల్చి చెబుతోంది. ప్రత్యేక పరిస్థితులను సైతం పరిగణలోకి తీసుకుంటుంది. బలమైన కుటుంబాల విషయంలో ఈ ఫార్ములాకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది.
చంద్రబాబు కుటుంబంలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్, బావమరిది నందమూరి బాలకృష్ణ తప్పనిసరిగా పోటీ చేస్తారు. శ్రీకాకుళంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడులకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా కుటుంబాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుందని.. అందుకే కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో ఆశావహులుగా ఉన్న వారికి ఇప్పటికే సమాచారం పంపించారు. ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సూచించారు.
రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఇప్పుడు సీట్ల సర్దుబాటు చేయడం చంద్రబాబుకు కష్టతరంగా మారుతోంది. కర్నూలులో కేఈ కుటుంబం ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కేఈ కృష్ణమూర్తి సోదరుడితో పాటు కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబంలో సైతం ఇద్దరు ఆశావహులు ఉన్నారు. ఒకరు పార్లమెంట్ స్థానానికి, మరొకరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ రెండు కుటుంబాల్లో ఒక్కొక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని.. ఎవరికి కావాలో తేల్చుకోవాలని చంద్రబాబు వర్తమానం పంపినట్లు సమాచారం.
అనంతపురంలో గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. ఓడిపోవడంతో రాప్తాడు ఇన్చార్జిగా మాజీ మంత్రి సునీతను, శ్రీరామ్ కు ధర్మవరం ఇన్చార్జిగా చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వగలనని చంద్రబాబు తేల్చినట్లు సమాచారం. అటు జెసి కుటుంబం విషయంలో సైతం ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు తో పాటు ప్రభాకర్ రెడ్డి కుమారుడు సైతం పోటీ చేశారు. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల్లో సైతం అవే స్థానాలను కోరుకుంటున్నారు. కొత్తగా జేసీ కుటుంబానికి చెందిన దీపక్ రెడ్డి సైతం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ అని చంద్రబాబు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఒకవేళ గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారు.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అయితే మాత్రం పార్టీ పునరాలోచించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కుటుంబాల విషయంలో చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయారు. కానీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉండడంతో.. తప్పదని వారిని బుజ్జగించే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు బుజ్జగింపులకు వారు తలొగ్గుతారా? లేదా? అన్నది చూడాలి.