AP: అసలే ఖాళీ ఖజానా అంటున్నారు చంద్రబాబు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అక్కడ డబ్బులు లేవని చెబుతున్నారు. కానీ ప్రముఖ భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్( bullet proof ) వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు కోసం ఏపీ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పది టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వాహనాలు రాష్ట్రంలోని ముఖ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వీఐపీల కోసం ఉపయోగించనుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు కొనుగోలు కోసం ఏపీ సర్కార్ రూ. 9.20 కోట్లు ఖర్చు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాహనాలనే వినియోగిస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా వాహనాలను సమకూర్చుకోనుండడం విశేషం.
* రాష్ట్రంలో పర్యటించే వీఐపీల కోసం
ఏపీలో( Andhra Pradesh) పర్యటించే విఐపిల కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పర్యాటక ప్రాంతాలు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటుగా వ్యాపార, రాజకీయ కారణాలతో పలువురు వీఐపీలు రాష్ట్రానికి వస్తుంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ మీద ఫోకస్ పెట్టిన తరుణంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరచూ పర్యటిస్తుంటారు. అందుకే ఏపీలోని ప్రముఖులతో పాటు రాష్ట్రానికి వచ్చే ముఖ్యులకు రక్షణగా ఉంటాయనే ఉద్దేశంతో కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. కొత్త వాహనాలు కాబట్టి.. సరికొత్త హంగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
* అప్పట్లో టిడిపి నుంచి విమర్శలు
అయితే గతంలో వైసీపీ సర్కార్( YSR Congress government) వాహనాలను ఇదే మాదిరిగా కొనుగోలు చేసింది ఆ సమయంలో టిడిపి చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు చేసింది టిడిపి. అయితే ఇప్పుడు సెక్యూరిటీ వాహనాలు ఉన్నా.. అదనంగా కొనుగోలు చేస్తుండడం విశేషం. అయితే 8 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు దూరంగా ఉండాలని భావించింది. ఇదే నిర్ణయాన్ని కూటమి పార్టీల ప్రజాప్రతినిధులకు వర్తింపజేసింది. కానీ ఇప్పుడు ఏకంగా ప్రముఖుల పేరుతో దాదాపు పది కోట్ల రూపాయలు కేవలం వాహనాలకే ఖర్చు చేస్తుండడం విశేషం.
* ప్రత్యర్థులకు ప్రచార అస్త్రం
చాలావరకు ఆర్భాటాలకు దూరంగా ఉన్నట్లు కూటమి( allians ) ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ కల్పిస్తున్నారు. మిగతా 23 మంది మంత్రులకు సైతం హై సెక్యూరిటీ ఉంది. అయితే ఇప్పుడు ప్రముఖుల పేరుతో ఈ కొత్తగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. అయితే ప్రభుత్వ అవసరాల కోసం అని చెబుతున్నారు. అయితే ఇవి రాష్ట్రానికి వచ్చే ప్రముఖుల కోసం అని చెప్పుకొస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో వైసీపీ సర్కార్ వాహనాలను కొనుగోలు చేస్తే సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ప్రత్యర్ధులు ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది.