Andhra Pradesh : ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలో లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారిణి దొరికిపోయింది. లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఆమె భర్తకు నామోషీగా అనిపించింది. పైగా ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం అతడిని పలుమార్లు పిలవడంతో ఇబ్బందిగా అనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు చులకనగా చూడడంతో బాధగా అనిపించింది. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి ఆమె కుమారుడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబం మొత్తం తన వల్ల ఇలా కావడంతో ఆత్మ న్యూనత భావంతో రెవెన్యూ అధికారి మానసిక అనారోగ్యానికి గురైంది. చివరికి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఒక లంచం పండంటి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఇలాంటి ఉదాహరణలు చూసినప్పటికీ.. ఉదంతాలు ఎదురవుతున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేదు.
ముద్దాయిగా మారింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలం ఎమ్మార్వో జాహ్నవి ఉదంతం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. పాస్ బుక్ విషయంలో లక్ష రూపాయలు లంచం అడిగి.. 30,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.. అయితే ఆమె జైలుకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది.. నక్కలం పేటకు చెందిన కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు తన యజమాని పొలం 1- బీ అడంగల్ లో నమోదు చేసి.. పట్టాదారు పుస్తకం కోసం దరఖాస్తు చేశాడు. దానిని మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ జాహ్నవి, వీఆర్వో రామారావు లక్ష రూపాయలు పైగా డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో కావడంతో అంత ఇవ్వలేనని చెప్పేశాడు.. ఆ తర్వాత అనేక చర్చలు జరిగిన తర్వాత 30 వేలకు ఒప్పందం కుదిరింది. అయితే ఆయన విజయవాడ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆ తర్వాత రైతు మాగంటి కోటేశ్వరరావు రెవెన్యూ కార్యానికి రాత్రిపూట వచ్చి.. వీఆర్వో, తహసీల్దార్ కి 30,000 ఇవ్వగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు తహసీల్దార్ గతంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో.. జాహ్నవి పై కేసులు నమోదయ్యాయి. నాడు జాహ్నవి విజయవాడ రూరల్ తహసీల్దార్ గా పని చేశారు.. అవినీతి కేసులలో ఏసీబీ అధికారులు దూకుడుగా దాడులు చేస్తున్నప్పటికీ.. కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అధికారులు మారడం లేదు. అయితే అధికారుల వ్యవహార శైలి వల్ల వారి కుటుంబ సభ్యులు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.