Chandrababu: ఏపీలో ఇక కొత్త సలహాదారులు.. చంద్రబాబు కసరత్తు

రాష్ట్ర డిజిపిగా ద్వారకా తిరుమలరావును నియమించారు. ఆయన తక్షణం చార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా.. అంతకంటే ముందే పాలనాపరమైన అంశాలకు సంబంధించి నియామకాలు చేపట్టడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : June 20, 2024 2:25 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు అధికారుల టీంను సైతం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. 19 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బదిలీ చేశారు. జగన్ అస్మదీయులైన నలుగురు కీలక అధికారులకు సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేశారు. రాష్ట్ర డిజిపిగా ద్వారకా తిరుమలరావును నియమించారు. ఆయన తక్షణం చార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా.. అంతకంటే ముందే పాలనాపరమైన అంశాలకు సంబంధించి నియామకాలు చేపట్టడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

ముఖ్యంగా కీలక శాఖలకు సంబంధించి సలహాదారుల నియామకంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక జాబితాను రూపొందించినట్లు సమాచారం. పాలన అనుభవంతో పాటుగా నమ్మకస్తులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు సలహాదారుల నియామకం పైన పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆర్థిక ప్రణాళిక విభాగంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి టక్కర్, ఏసీబీలో మంచిపట్టున్న ఆర్పీ ఠాకూర్, చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావులను సలహాదారులుగా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కేవలం చంద్రబాబుకు సన్నిహిత అధికారి కావడంతోనే ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కార్ వెంటాడింది. సీనియర్ ఐపీఎస్ అధికారిగా.. ఏపీ డీజీపీ హోదాలో ఉన్న ఆయనను అవమానించింది. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపివేసింది. చివరి రోజున పోస్టింగ్ ఇవ్వగా.. అదే రోజు ఆయన పదవీ విరమణ చేశారు. ఒక్క ఏబీ వెంకటేశ్వరరావే కాదు. చాలామంది అధికారులు వైసీపీ సర్కార్ చేతిలో బాధితులుగా మిగిలారు. వారందరికీ ప్రస్తుత ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇన్వెస్ట్మెంట్ బోర్డు చైర్మన్గా పదవి విరమణ చేసిన జాస్తి కృష్ణ కిషోర్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకునే అవకాశం ఉంది.

ఇక జ్యుడీషియల్ పరిధిలో.. ప్రభుత్వ ఏజే శ్రీరామ్ స్థానంలో దమ్మాలపాటి శ్రీనివాసును ప్రభుత్వం నియమించింది. తాజాగా జలవనురుల శాఖ సలహాదారుడిగా వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఖరారు చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. నామినేటెడ్ పదవుల కంటే ముందుగానే పాలనాపరంగా సలహాదారుల నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సలహాదారుల పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.