Chandrababu: బాబూ.. ఐదేళ్లలో అమరావతి పూర్తి చేస్తే ఈ బాధ ఉండేది కాదు కదా?

2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు.అందరి సమ్మతితో అమరావతి రాజధానిని ప్రకటించారు. చంద్రబాబు పై ఉన్న నమ్మకంతో అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

Written By: Dharma, Updated On : June 20, 2024 2:17 pm

Chandrababu

Follow us on

Chandrababu: అమరావతి రాజధాని ప్రాంతాన్ని చూసిన చంద్రబాబు చలించిపోయారు. అక్కడ నిర్మాణాలను పరిశీలించి నిర్ఘాంత పోయారు. నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లారు. సాష్టాంగ నమస్కారం చేశారు. మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. అక్కడ మట్టికి పూజలు చేశారు. భావోద్వేగానికి గురయ్యారు. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.మొన్న సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు.. నేడు అమరావతిలో పర్యటించారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు కళ్ళల్లో మాత్రం రాజధాని పూర్తి చేయలేకపోయాను అన్న బాధ మాత్రం స్పష్టంగా కనిపించింది.

2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు.అందరి సమ్మతితో అమరావతి రాజధానిని ప్రకటించారు. చంద్రబాబు పై ఉన్న నమ్మకంతో అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కానీ పాలన అనుమతులు, వివిధ రకాల కారణాలు చూపుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం, తొలుత తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభించడం, శాశ్వత నిర్మాణాల విషయంలో జాప్యం జరగడం తదితర కారణాలతో.. అమరావతి విషయంలో అనుకున్న స్థాయిలో అడుగులు పడలేదు. ఇది అమరావతి పాలిట శాపంగా మారింది. అన్నింటికీ మించి నాడు కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామ్యంగా ఉంది. కానీకేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తేలేకపోయారు చంద్రబాబు.పైగా ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందుగానే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అది కూడా అమరావతి పాలిట శాపంగా మారింది. నిర్మాణాలపై పెను ప్రభావం చూపింది. చంద్రబాబు చూపించింది గ్రాఫిక్స్ అన్నమాట ఎక్కువగా వినిపించింది. నాడు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నిత్యం అమరావతి మాటను వల్లె వేశారు. కానీ నిర్మాణాలు పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన స్థాయిలో అడుగులు వేయలేదు. ఇది మైనస్ గా మారింది.

2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరగడంతో అమరావతి నిర్వీర్యం అయ్యింది. మూడు రాజధానులు తెరపైకి రావడంతో అమరావతి సమిధగా మారింది. చివరకు ఒకరిద్దరు మంత్రులు అమరావతిని స్మశాన వాటికతో పోల్చారు. అమరావతి రైతులు పోరాట బాట పట్టాల్సి వచ్చింది. ఎన్నెన్నో అవమానాలు, ఉక్కు పాదాలు, పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఐదేళ్ల పోరాట ఫలితం కారణంగా.. ఇప్పుడు చంద్రబాబు గెలవడం ద్వారా కొత్త ఆశలు వచ్చాయి.గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఎటువంటి అనుమతులు అక్కర్లేదు, నిబంధనలు లేవు. పైగా కేంద్రంలో టిడిపి కీలకం. కేంద్ర పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంది.