Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ లో( Nara Lokesh) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన పనితీరులో సమూల మార్పులు రావడం విశేషం. రాష్ట్ర మంత్రిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తేగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. కేంద్ర పెద్దలతో తరచూ మాట్లాడుతున్నారు. అదే సమయంలో రాజకీయంగా సొంత పార్టీని ఒంటి చేత్తో నడపగలుగుతున్నారు. చంద్రబాబు పూర్తిగా పాలనపై దృష్టి పెట్టెలా.. మిగతా వ్యవహారాలను అన్నీ తానై చూస్తున్నారు నారా లోకేష్. మరోసారి డేరింగ్ స్టెప్ వేశారు నారా లోకేష్. కూటమి ప్రతిష్టాత్మకంగా అనంతపురంలో నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ ‘ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను రప్పించే బాధ్యతను తీసుకున్నారు. అందుకే ఈ సభకు వెళ్లకుండా సచివాలయం నుంచి నేపాల్ నుంచి సురక్షితంగా తెచ్చే ప్రయత్నాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నేపాల్ లో చిక్కుకున్న ఏపీ ప్రజలను రక్షించనున్నారు నారా లోకేష్.
Also Read: మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… మన చుట్టూ అగ్రరాజ్యాల కుట్రలు?
* కూటమి విజయోత్సవ సభ..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. సంక్షేమ పథకాలతో సైతం అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. నిధులు సమీకరించగలిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన కూడా జరిగింది. సంక్షేమ పథకాలు పట్టాలెక్కాయి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్లు.. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయగలిగింది కూటమి ప్రభుత్వం. 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకం సైతం పూర్తి చేయగలిగింది. అందుకే 15 నెలల కూటమిపాలన సక్సెస్ కావడంతో అనంతపురం వేదికగా భారీ కార్యక్రమానికి ఈరోజు సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నారా లోకేష్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం మాత్రం చిన్న విషయం కాదు. అయితే నేపాల్ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రజల కష్టాలను గట్టెక్కించేందుకు లోకేష్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది.
* సచివాలయంలోనే లోకేష్..
నేపాల్( Nepal) పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు నారా లోకేష్ వెళ్తారు. రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టిజిఎస్ సెంటర్ కు రావాలని ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్. అక్కడ ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. అత్యంత కీలకమైన ఈ బాధ్యతను వేరే నేతలకు, మంత్రులకు అప్పగించకుండా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం విశేషం.
* ఆ మంత్రికి బాధ్యతలు అప్పగించినా
వాస్తవానికి విదేశాల్లో చిక్కుకునే వారిని స్వస్థలాలకు తెప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ( AP government)ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. మంత్రివర్గ ఏర్పాటు సమయంలోనే ఆ బాధ్యతలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పగించింది. అయితే ఎక్కువగా విదేశాల్లో చిక్కుకున్న వారి విషయంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. విదేశాల్లో ఉండే బాధితులు ఎక్కువగా లోకేష్ ను ఆశ్రయించడం ప్రారంభించారు. లోకేష్ ను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని బాధితుల అభిప్రాయం. అందుకే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గ్రీవెన్స్ సెల్ పెడితే.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి అక్కడ వినతులు అందిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కేంద్రం వద్ద కూడా లోకేష్ పరపతి పెరిగింది. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సైతం నారా లోకేష్ కు సాన్నిహిత్యం ఉంది. అందుకే ఏపీకి పెట్టుబడుల వరద వస్తోంది. ఇంకోవైపు విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు సైతం లోకేష్ తో టచ్ లో ఉంటారు. అందుకే విదేశాల్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు నారా లోకేష్. అయితే ఇప్పుడు నేపాల్ లో అల్లకల్లోలం ఉన్న నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను రప్పించే గురుతుర బాధ్యతను తీసుకున్నారు నారా లోకేష్. ఓ రాజకీయ భారీ బహిరంగ సభ ప్లాన్ చేసిన తర్వాత ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ, కూటమిలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ దూరంగా ఉండడం.. అది కూడా ప్రజల కోసమే కావడం నిజంగా అభినందించదగ్గ విషయం.