Nara Lokesh: ఏపీలో లోకేష్ ( Nara Lokesh) రెడ్ బుక్ తెరిచారా? అందుకే అరెస్టులు ప్రారంభమయ్యాయా? తరువాత అరెస్ట్ ఎవరిది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ 2.0 అని ప్రకటన చేయగానే.. లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రకటన చేశారు. వెనువెంటనే వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. హైదరాబాదులో ఉంటున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. ఒకటి కాదు రెండు కాదు 16 కేసులు ఆయనపై నమోదైనట్లు ప్రచారం నడుస్తోంది. ఒక వ్యూహం ప్రకారం వల్లభనేని వంశీ అరెస్టు జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు తరువాత ఎవరు? అంటే మాత్రం అందరి వేళ్ళు కొడాలి నాని వైపు చూపిస్తున్నాయి.
* ఇద్దరూ సన్నిహితులే
వల్లభనేని వంశీ మోహన్ కు( Vallabha neni Vamsi Mohan) అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. 2009 ఎన్నికల తరువాత కొడాలి నాని చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు కొడాలి నాని. గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వల్లభనేని వంశీ మోహన్. పార్టీలు వేరైనా ఇద్దరి స్నేహం కొనసాగింది. 2019లో అదే మాదిరిగా పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని దగ్గరుండి వల్లభనేని వంశీని ఫ్యాన్ పార్టీలోకి తీసుకెళ్లారు. గత ఐదేళ్లుగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా వైసీపీ ఎమ్మెల్యే గానే కొనసాగారు.
* ఇద్దరిదీ దురుసుతనమే
వల్లభనేని వంశీ తో పాటు కొడాలి నాని ( Kodali Nani)చంద్రబాబు విషయంలో దురుసుగా ప్రవర్తించేవారు. లోకేష్ విషయంలో అయితే అసభ్యకర మాటలతో చాలా చిన్నచూపు చూసేవారు. వల్లభనేని వంశీ ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని పర్యవసానాలే నేటి వల్లభనేని వంశీ అరెస్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వల్లభనేని వంశీ తరువాత నెక్స్ట్ ఎవరంటే మాత్రం.. కచ్చితంగా కొడాలి నాని ఉంటారన్నది ప్రతి ఒక్కరి అనుమానం.
* విపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్
విపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్ ( red book )రాసుకున్నారు యువనేత నారా లోకేష్. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీతో పాటు టిడిపి నాయకులను వేధించారో.. వేధింపులకు గురి చేశారో.. అటువంటి నేతలను వెంటాడుతామని లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు కూడా. కొడాలి నానిని అయితే నడిరోడ్డుపై పరుగెత్తిస్తామని చెప్పుకొచ్చారు. అవే మాటలను గుర్తు చేసుకుంటున్నారు విశ్లేషకులు. వల్లభనేని వంశీ తరువాత తప్పకుండా కొడాలి నాని అరెస్టు ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.