Chandrababu: తెలుగుదేశం పార్టీ మూడో తరాన్ని ఇప్పుడు చూస్తోంది. నందమూరి తారక రామారావు పార్టీని ఏర్పాటు చేశారు. అదే పార్టీని నారా చంద్రబాబు సుదీర్ఘకాలం నడిపారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలను తీసుకున్నారు నారా లోకేష్. ఇలా ముచ్చటగా మూడు తరాలను చూసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఎన్నెన్నో గెలుపు, ఓటములను చవిచూసింది. మరెన్నో మైలురాళ్లను దాటింది. దారి పొడవునా ఇబ్బందులను అధిగమించగలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటం. అయితే దీనికి పునాది వేసింది నందమూరి తారక రామారావు అయితే.. రాజకీయ వ్యూహాలతో నిలబెట్టింది మాత్రం చంద్రబాబు. ఇప్పుడు వారిద్దరినీ దాటుకొని లోకేష్ మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీని నడిపించగలరు అనేది ఒక నమ్మకం.
* ఎన్నో చారిత్రక మలుపులు..
అనేక చారిత్రక మలుపులను చూసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి సారధి అయ్యారు నారా లోకేష్. పేరుకే అధినేత చంద్రబాబు కానీ ఇప్పుడు సర్వాధికారాలు లోకేష్ చేతిలోకి వెళ్లాయి. అయితే ఆ బాధ్యత, ఆ పదవి అంత ఈజీ కాదు. ప్రస్తుతానికి లోకేష్ కు అది ముళ్ల కిరీటం. అది కేవలం ఒక పదవి మాత్రమే కాదు. ఒక తరం బాధ్యత. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్టీఆర్ ఆవేశం, చంద్రబాబు ఆలోచనలతో ప్రయాణం చేసింది సైకిల్. కచ్చితంగా ఇప్పుడు వాటికి వైవిధ్యమైన మార్పు చూపించాల్సి ఉంటుంది లోకేష్. మారుతున్న రాజకీయ విధానాలను అందిపుచ్చుకొని.. తెలుగుదేశం పార్టీని కొత్త వేగానికి తగ్గట్టు మార్చాల్సిన అవసరం నారా లోకేష్ పై ఉంది. పార్టీని భవిష్యత్తు వైపు నడిపించే ఒక వ్యూహాత్మక శక్తిగా అవతరించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ను మరిపించి.. చంద్రబాబును తలపించి లోకేష్ పార్టీని నడపాల్సిన బాధ్యత ఉంది.
* కఠిన పరీక్షలు
వారసుడు వరకు నారా లోకేష్ ఓకే. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నో రకమైన కఠిన పరీక్షలు ఎదురవుతాయి. ప్రత్యర్థితో రాజకీయంగా తలపడాలి. కానీ పార్టీలో మాత్రం నిత్య పర్యవేక్షణ ఉండాలి. ప్రతి నాయకుడిని సంతృప్తి పరచాలి. అదే సమయంలో ప్రజామోదం పొందాలి. అంటే ఏకకాలంలో మూడు పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ మూడు అంశాల్లో నారా లోకేష్ ప్రాథమికంగా కొంత అనుభవం సాధించారు. అందుకే నాలుగు దశాబ్దాల పాటు పార్టీని నడిపించే అనుభవ సామర్థ్యాన్ని తెచ్చుకున్నారు నారా లోకేష్. విశ్లేషకులు కూడా ఇదే మాట చెబుతూ వస్తున్నారు.
* చంద్రబాబు ఎన్నో దాటుకొని..
చంద్రబాబు గతాన్ని గుర్తుచేస్తే ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. టిడిపి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. తరువాత తనలో ఉన్న కొత్త ఆవిష్కరణలను బయట పెట్టుకున్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా ఐటీ విప్లవాన్ని తెచ్చారు. తాజాగా డిజిటల్ శక్తిని పార్టీలోకి తెచ్చి.. యువతకు పెద్దపీట వేస్తున్నారు. సీనియర్లకు ప్రత్యామ్నాయంగా జూనియర్లను ప్రోత్సహించడం ద్వారా పార్టీలో దశాబ్దాలుగా ఉన్న పద్ధతను తొలగించి.. నవ ఉత్సాహాన్ని నింపడంలో ఆయన విజయవంతం అయ్యారు.
* సంక్షోభాలు కొత్త కాదు..
తెలుగుదేశం పార్టీ నాలుగున్నర దశాబ్దాల పాటు ఏపీలో ఉనికి చాటుకోవడం వెనుక ఉన్నది ఆ పార్టీకి ఎదురైన సంక్షోభాలే. ఏ మనిషి అయినా.. ఏ వ్యవస్థ అయినా సంక్షోభాలు దాటుకొని నిలబడితే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే అది తెలుగుదేశం పార్టీకి పుష్కలం. కానీ సుదీర్ఘకాలం ఈ సంక్షోభాలను దాటుకొని వచ్చారు చంద్రబాబు. ఎన్టీఆర్కు కేవలం రెండుసార్లు మాత్రమే సంక్షోభాలు ఎదురైతే.. చంద్రబాబుకు మాత్రం ప్రతినిత్యం సవాళ్లే. అయితే ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కోవడంలో సంయమనం అవసరం. ఇప్పుడు అది నారా లోకేష్ కు అత్యంత అవసరం కూడా. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో రాజకీయ ప్రత్యర్థులు నేర్పించారు నారా లోకేష్ కు. ఇప్పుడు కూడా ఆయనకు అది అక్కరకు వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీని నాలుగు దశాబ్దాల పాటు ముందుకు నడిపే శక్తి ఆయనకు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..