Australia Invites Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh) తన పరిణితిని మరింత పెంచుకుంటున్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా మెరవనున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అటు తరువాత అమెరికాలో పర్యటించారు. ఇటీవల సింగపూర్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బృందంలో లోకేష్ ఒకరు. ఏపీలో పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ఆయన పర్యటనలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు నారా లోకేష్. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్ ప్రోగ్రాంలో పాల్గొనాలని ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ కార్యాలయం నుంచి లేక అందింది నారా లోకేష్ కు. ఏపీలో విద్య, ఐటి, మానవ వనరులు, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కమిషనర్ ప్రశంసించినట్లు తెలుస్తోంది.
20 ఏళ్లుగా భారత ప్రముఖులకు ఆహ్వానం..
గత 20 సంవత్సరాలుగా మన దేశానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపేది ఆస్ట్రేలియా ప్రభుత్వం( Australia Government). 2001లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. ఇప్పుడు అదే వేదికలో నారా లోకేష్ పాల్గొనడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టార్టాప్ లు, ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో ఆస్ట్రేలియా నుంచి సహకారం పెరగడానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నారా లోకేష్ ఈ అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వ కారణమని.. ఈ అవకాశాన్ని ఏపీ అభివృద్ధి దిశగా మలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వస్తున్న వేళ..
మొన్ననే సీఎం చంద్రబాబు( CM Chandrababu) బృందం సింగపూర్ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గతంలో లోకేష్ విదేశీ పర్యటనకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక దిగ్గజ సంస్థలు టిసిఎస్, గూగుల్ వంటి సంస్థలు ఏపీలో ప్రవేశించాయి. వీటిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశాయి. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలకడం విశేషం. నారా లోకేష్ తన పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆక్వా కల్చర్, ఐటీ రంగం వంటి అంశాలపై చర్చించనున్నారు.