Nara Lokesh Tweet Viral: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) క్రమశిక్షణ గల మనిషి. ఆది నుంచి ఆయన క్రమశిక్షణనే నమ్ముకున్నారు. తన ఏకైక కుమారుడు లోకేష్ కు కూడా అదే క్రమశిక్షణ అలవరిచారు. ఎంతటి విపత్కర సమయంలో అయినా.. చంద్రబాబు ఓపెన్ కారు. రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి ఆరోపణలు చేసినా చలించరు. అయితే మొన్నటి వైసిపి హయాంలో కుటుంబ సభ్యులను కించపరచడంతో తట్టుకోలేకపోయారు. అంతకుమించి చంద్రబాబు ఎక్కడా ఓపెన్ అయిన సందర్భాలు లేవు. నారా లోకేష్ సైతం అంతే. ఆయన సైతం ప్రత్యర్ధులు ఎంతటి ఆరోపణలు చేసినా చలించేవారు కాదు. చివరకు ఆయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినా సహనంతో ముందుకు సాగారే తప్ప.. ఎటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఆ క్రమశిక్షణ, ఆ సహనం తన తండ్రి చంద్రబాబు నుంచి అలవడ్డాయని చెప్పుకొచ్చారు నారా లోకేష్. చంద్రబాబు తొలిసారిగా సీఎం గా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు అవుతోంది ఈరోజు నాటికి. అందుకే ఈరోజు తండ్రి చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ పరిణితి..
కుమారుడు మంత్రి.. తండ్రి ముఖ్యమంత్రి. కొద్దిమందికే ఇది సాధ్యమవుతుంది. అందులో చంద్రబాబు, లోకేష్ ఉండడం ఒక విశేషమే. 2014లోనే చంద్రబాబు క్యాబినెట్లో లోకేష్( Nara Lokesh) ఒక సభ్యుడు. కానీ అప్పుడు అంతగా లోకేష్ రాజకీయ పరిణితి సాధించలేదు. కానీ 2024 కు వచ్చేసరికి.. పూర్తిగా సీన్ మారింది. రాజకీయ పరిపక్వత సాధించారు లోకేష్. తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నారు. తన సమర్థతను నిరూపించుకున్నారు. అందుకే చంద్రబాబు సైతం లోకేష్ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. అయితే చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యేనాటికి బాల్యంలో ఉన్నారు నారా లోకేష్. తండ్రి రాజకీయాల్లో ఉండగా.. తల్లి భువనేశ్వరి పర్యవేక్షణలోనే పెరిగారు. కుమారుడి బాధ్యతలను చంద్రబాబు కంటే భువనేశ్వరి అధికంగా చూసుకునేవారు. అయితే తండ్రి గొప్పతనాన్ని చిన్ననాటి నుంచే చూసేవాడినని లోకేష్ తాజాగా వెల్లడించారు.
అభివృద్ధికి సజీవ వారసత్వం..
1995 సెప్టెంబర్ ఒకటిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అటు తరువాత 1999, 2014, 2024 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారిగా ప్రమాణం చేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. ఇంట్లో నాన్న.. పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం నాకు లభించింది. పాలనను సాంకేతికతను జోడించి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వరకు ప్రయాణం సాగింది. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారు. హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ కొత్త సాంకేతిక గుర్తింపును శక్తివంతం చేశారు. అమరావతి నిర్మాణం వరకు ఆయన నాయకత్వం ఎన్నో ఆవిష్కరణలకు మైలురాయి. ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి.. అన్ని రంగాలను గణనీయమైన అభివృద్ధి పధం దిశగా ప్రయాణింప చేస్తున్నారు’ అంటూ కొనియాడారు. చంద్రబాబు విషయంలో తన మదిలో ఉన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు నారా లోకేష్.