Nara Lokesh Help Rural Development Trust: నాయకుడంటే ఎలా ఉండాలో చెబుతున్నారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh). ఎవరికి ఎలాంటి సాయం చేయాలో అలానే చేస్తున్నారు. అన్ని వర్గాలతో పాటు అన్ని రంగాల వారికి అండదండలు అందిస్తున్నారు. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా ఇప్పుడు లోకేష్ ను ఆశ్రయిస్తున్నారు. అలా అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ లోకేష్ ను ఆశ్రయించింది. తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి దానికి పరిష్కార మార్గం చూపించారు మంత్రి నారా లోకేష్. అనంతపురంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అయితే అది ఒక జిల్లాకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల గ్రామీణ జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతోంది. కానీ ఆ సంస్థ కార్యకలాపాలకు ఒక రకమైన ఇబ్బంది వచ్చింది. విదేశీ నిధులకు సంబంధించి.. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ( fcra ) కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిలిపివేసింది.
* లక్షలాది మందికి సేవలు..
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ( rural development trust) అనేది దశాబ్దాలుగా పేదల అభ్యున్నతికి అంకితమై పని చేస్తున్న సంస్థ. అయితే విదేశీ నిధులపై ఏర్పడిన సందిగ్ధత సేవా కార్యక్రమాలపై ప్రభావం చూపింది. లక్షలాదిమంది లబ్ధిదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకుడు మాంచో ఫెర్రీర్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వంతో సమగ్రంగా చర్చలు జరిపారు. విదేశీ నిధులకు సంబంధించి అవసరమైన అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులను పునరుద్ధరించింది. సంస్థ సేవలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

* విభిన్న రంగాల్లో ముద్ర..
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది కేవలం స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం కావు. పేదల ఇళ్లలో విద్యుత్, నీటి వంటి మౌలిక సదుపాయాల కల్పన నుంచి.. నిరుపేదల పిల్లలకు విద్యా అవకాశాలు, యువతకు ఉపాధి మార్గదర్శకత్వం, మహిళలకు ఆర్థిక సాధికారత, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు… ఇలా విభిన్న రంగాల్లో సంస్థ ముద్ర వేసింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అంతటి సంస్థకు విదేశీ నిధులకు సంబంధించిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ నివేదించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విదేశీ నిధులకు సంబంధించి అనుమతులను పునరుద్ధరించింది.

* లోకేష్ కు కృతజ్ఞతలు..
లక్షలాదిమంది పేద ప్రజలతో సంబంధమైన సంస్థ కావడంతో ప్రత్యేక చొరవ తీసుకున్నారు మంత్రి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వ అనుమతులను పునరుద్ధరించడం పై రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకుడు మాంచో ఫెర్రీర్ ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా సేవా ధోరణితో గ్రామీణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సేవల పునరుద్ధరణ ఒక్క సంస్థకే పరిమితం కాదని.. లక్షలాదిమంది పేదల జీవితాల్లో స్థిరత్వం, ఆశలు నిలబెట్టే ఒక వ్యవస్థ అని గుర్తించి ఈ సాయం చేసినట్లు చెప్పుకొచ్చారు లోకేష్. అయితే లోకేష్ కృషి ఇప్పుడు రాయలసీమ అంతా గుర్తిస్తోంది. నాయకుడంటే ఇలా ఉండాలి అనేలా లోకేష్ తీరు ఉంది.
