Nara Lokesh : రాజకీయాల్లో భజన అనేది ఎప్పుడూ ఉంటుంది. కిందిస్థాయి నేతల నుంచి అదే పరిస్థితి. పదవులతో పాటు పనులు చేయించుకునేందుకు కొందరు అలా భజన చేస్తారు. అయితే అది స్థాయికి మించితే మాత్రం చేటు తెస్తుంది. తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రకాల కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు నారా లోకేష్. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతో పరిణితి సాధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా.. రాష్ట్ర పాలకుడిగా తన మార్కు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయన దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాపకం కోసం అతిగా వ్యవహరించి ఆయననే చిక్కుల్లో పెడుతున్నారు. తాజాగా దీపక్ రెడ్డి అనే టిడిపి నేత లోకేష్ ను ఇరకాటంలో పెట్టారు. ఇండిగో సంక్షోభంలో లోకేష్ పేరును బయటకు తెచ్చారు. నేషనల్ మీడియా డిబేట్లో పాల్గొని విమాన సంక్షోభాన్ని నియంత్రించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. వెంటనే దానిపై స్పందన వచ్చింది. లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రి కాదు కదా అని ప్రత్యర్థులు కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు.
* జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసింది అదే..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) హయాంలో ఇలానే నేతల భజన అధికంగా ఉండేది. ఒకానొక దశలో వైవి సుబ్బారెడ్డి భార్య కూడా సాక్షాత్తు తిరుమలలో జగన్మోహన్ రెడ్డి భజన చేశారు. జగన్ చుట్టూ భజన పరులు ఉండేవారు. వారు ఆయనకు వాస్తవాలు చెప్పకుండా భజనతో గడిపేసేవారు. మొన్నటికి మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి బాధ అదే. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయకుండా మేనేజ్ చేశారని కోటరీ పై ఆయన ఆరోపణలు చేశారు. ఒక విధంగా ఆరోపణలు కంటే వాస్తవం అదే. ఎవరైనా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే సహించలేకపోయేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే ఆ సంస్కృతి కింది స్థాయి వరకు చేరింది. అంతా జగన్ మానియా నడిచింది. దీంతో ఆయనకు వాస్తవాలు తెలియలేదు. అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను గుర్తించలేకపోయారు. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో చవిచూశారు.
* వ్యతిరేక ప్రచారం..
లోకేష్ ( Nara Lokesh)విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ప్రతి నిమిషం నిఘాతో ఉన్నారు. ఇటువంటి సమయంలో లోకేష్ ఆడే ప్రతి మాట.. చేసే ప్రతి పని కూడా గమనిస్తుంటారు. ఆపై ఎన్ని రకాలు ముద్రవేయాలో అన్ని రకాలుగా వేస్తారు. ఆయన ను షాడో ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి పై స్థాయిలో కొనసాగుతోందని ఆరోపిస్తూ కథనాలు ప్రచురిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అతి భజన అనేది లోకేష్ భవిష్యత్తుకు ఇబ్బందికరమే. ఇది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ భజనను నియంత్రించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.