YS Vivekananda Reddy case : వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy) హత్య కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల రోజుల్లో ఈ కేసును పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు జరిగిన విచారణ చాలు అని.. సిబిఐ కూడా ఈ కేసును క్లోజ్ చేయాలని భావిస్తోందని నిందితులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అనేక రకాల అనుమానాలు ఉన్నాయని.. అసలైన సూత్రధారులను విచారించలేదని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించడంతో ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో? ఎవరెవరిని విచారించాల్సి ఉందో? వారందరినీ విచారించి నెల రోజుల్లో అసలు నిందితులను గుర్తించాలని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇప్పుడు నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పకుండా అసలు సూత్రధారులు పట్టుబడే అవకాశం ఉంది.
* రాష్ట్రం నుంచి అందని సహకారం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో దర్యాప్తు సవ్యంగా తేలలేదన్నది బహిరంగ రహస్యం. అప్పట్లో ఏపీ పోలీస్ శాఖ నుంచి సిబిఐ బృందానికి సరైన సహకారం కూడా అందలేదు. ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక అది తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అప్పటికే ఎన్నికల వ్యూహరచన లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి శిబిరం. అందులో ఒకరైన మాజీ సిఎస్ అజయ్ కల్లాం సిబిఐ కు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసింది వైయస్ భారతి రెడ్డికి అని.. ఎన్నికల వ్యూహ సమావేశంలో తమతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆమె ఈ విషయం చెప్పారని స్టేట్మెంట్ ఇచ్చారు అజయ్ కల్లాం. కానీ తర్వాత ఆయన మాట మార్చేశారు. అప్పటికే ఆ స్టేట్మెంట్ కోర్టు వరకు వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్లతో పాటు రికార్డులు పరిశీలించి విచారణను ఒక కకొలిక్కి తేవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం మాత్రం నిజంగా సంచలనమే.
* విచారణపై ప్రభావం..
సిబిఐ( Central Bureau of Investigation ) దర్యాప్తుపై గత వైసిపి పాలనలో ప్రభావం చూపారు అన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని కోరింది జగన్మోహన్ రెడ్డి శిబిరం. అధికారంలోకి వచ్చాక అదే సిబిఐ దర్యాప్తు అవసరం లేదని తేల్చేశారు. అటువంటప్పుడు ఆ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహకారం అందడం అంత ఈజీ కాదు. చివరకు సిబిఐ అధికారిపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె, అల్లుడి పై సైతం సంచలన ఆరోపణలు చేయగలిగారు. వీటి వెనుక ఉన్న ఉద్దేశం అర్థం కానిది కాదు. కచ్చితంగా ఈ కేసు నుంచి బయట పడేందుకు చెయ్యరాని పనులు చేశారు. ఏకంగా ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డులను మార్చేశారు. వాటిని వెనక్కి తీసుకునేలా చేశారు. అయితే ఇప్పుడు ఆది నుంచి దర్యాప్తు జరగనుండడంతో నిజంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జగన్ అధికారంలో లేరు. కూటమి అధికారంలో ఉంది. ఆపై రాజకీయ ప్రత్యర్థులు నిందితులుగా ఉన్నారు. కచ్చితంగా ఇది హై ప్రొఫైల్ కేసు. ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వపరంగా విచారణకు సహకారం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం వైయస్ వివేకా కుమార్తె సునీత సక్సెస్ అయినట్టే.