Nara Lokesh vs Karnataka: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దిగ్గజ సంస్థలను ఆకర్షించగలుగుతోంది. సహజంగానే ఇది పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. దక్షిణాదిలో ఐటీ రంగంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు గణనీయమైన అభివృద్ధి సాధించాయి. ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటి సరసన విశాఖ చేరేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా విశాఖను ఐటి హబ్ గా మార్చాలని భావిస్తోంది. అందుకు జరుపుతున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. దాదాపు రూ.87 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అది మొదలు దేశంలో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూడడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతోనే ఐటీ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. ప్రధానంగా గత 16 నెలల్లో మంత్రి నారా లోకేష్ విదేశాల్లో పర్యటనలు, పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరు ప్రత్యేకంగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల సైతం అభినందించక తప్పడం. అయితే కర్ణాటక నుంచి మాత్రం ఒక రకమైన కామెంట్స్ వస్తున్నాయి. వాటిని సైతం సానుకూలంగా మార్చుకుంటున్నారు నారా లోకేష్. ఇతర రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ ఉండడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలమని లోకేష్ అభిప్రాయపడుతున్నారు.
ఐటీ యాజమాన్యాల అసంతృప్తి..
అయితే ఏపీ ప్రయత్నాలు కర్ణాటకలో( Karnataka) రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. అక్కడ మౌలిక వసతులు పై ఐటీ సంస్థల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా కంపెనీల ప్రతినిధులు. అటువంటి వారికి విశాఖ స్వర్గధామం గా ఉందని.. అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని నారా లోకేష్ ఆఫర్ ఇస్తున్నారు. అది ఎంత మాత్రం కర్ణాటక ప్రభుత్వానికి రుచించడం లేదు. ఉంటే ఉండండి.. లేకుంటే పొండి అంటూ సాక్షాత్ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకపై ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. విపరీతమైన రాయితీలు, మినహాయింపులు ఇవ్వడంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. దీనిపై నారా లోకేష్ ధీటుగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులు స్పైసీగా ఉంటాయని వ్యంగ్యంగా బదులిచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఐటీ పరిశ్రమల చూపు ఏపీ వైపు అని అర్థమవుతోంది. బెంగళూరు నుంచి యు టర్న్ తీసుకుంటాయన్న ఆందోళన అక్కడ కనిపిస్తోంది.
కేంద్రమంత్రి ఘాటు స్పందన..
మరోవైపు కర్ణాటక రాష్ట్ర పాలకుల మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. బెంగళూరులో( Bengaluru) రోడ్ల పరిస్థితి పై ఓ కంపెనీ అధినేత ట్వీట్ చేశారు. దానికి లోకేష్ స్పందించి విశాఖ రావాలని కోరారు. అది మొదలు కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తప్పుపడుతున్నారు. అయితే ఇలా వస్తున్న విమర్శలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ మాజీ సి ఎఫ్ ఓ మోహన్దాస్ వంటి ప్రముఖులు లేవలెత్తిన సమస్యలను ప్రస్తావించారు. విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే కొందరు అతి చేస్తున్నారని.. అలాంటి వాటికి తాను భయపడనన్నారు. కొంతమంది వ్యాపారవేత్తలు ఎదిగిన తర్వాత తమ మూలాలను మర్చిపోయి వీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారని.. వాటిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విమర్శలపై స్పందించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి. పారిశ్రామికవేత్తల విషయంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. సీఎం సిద్ధరామయ్య ఇటీవల ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి దంపతులపై వ్యాఖ్యలు చేశారు. అయితే కుల గణనలో తాము పాల్గొనబోమని ప్రకటించారు. దీనిపై సిద్ధరామయ్య వారిపై విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై స్పందించారు కుమారస్వామి. పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయేలా చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి అయితే ఏపీ ప్రభుత్వ దూకుడు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది.