Nara Lokesh: లోకేష్ చేతికి పగ్గాలు

తమిళనాడు డీఎంకే ఉదంతమే ఒక ఉదాహరణ. నాడు కరుణానిధి కరెక్ట్ సమయంలో తన వారసుడిగా స్టాలిన్ ప్రకటించడం వల్లే.. నేడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు.

Written By: Dharma, Updated On : May 23, 2024 2:11 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు చంద్రబాబు. సరైన సమయంలో తన వారసుడిగా లోకేష్ ను ప్రకటించలేకపోయారు. ఇప్పటికీ ఆ లోటు కొనసాగుతోంది. ఈ ఎన్నికలు చంద్రబాబు, పవన్ చుట్టూ తిరిగాయి. లోకేష్ పక్కకు వెళ్లిపోయారు. కనీసం లోకేష్ కు అవకాశం ఇవ్వలేదన్న టాక్ నడిచింది. అయితే అది వ్యూహాత్మకమే అయినా.. ఈ ఎన్నికల్లో టిడిపి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఈసారైనా చంద్రబాబు జాగ్రత్త పడి లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తారా? లేదా? అన్నది చూడాలి.

తమిళనాడు డీఎంకే ఉదంతమే ఒక ఉదాహరణ. నాడు కరుణానిధి కరెక్ట్ సమయంలో తన వారసుడిగా స్టాలిన్ ప్రకటించడం వల్లే.. నేడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. పార్టీలో నాయకత్వం విషయంలో స్టాలిన్ కు సోదరుడు అళగిరి పోటీగా వచ్చారు. కానీ నిలవలేకపోయారు. కరుణానిధి ముందునుంచే స్టాలిన్ కు ప్రోత్సాహం అందించారు. తన రాజకీయ వారసుడిగా డీఎంకే శ్రేణులకు పరిచయం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం తన కుమారుడికి లైన్ క్లియర్ చేశారు. సోదరుడు వివేకానంద రెడ్డి ఉన్నా.. ముందు చూపుతో జగన్ ను కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. తన రాజకీయ వారసుడు జగన్ అని చెప్పకనే చెప్పారు. అయితే ఆయన అకాల మరణంతో.. ఆ సానుభూతి తన రాజకీయ వారసుడు అయిన జగన్ కు అక్కరకు వచ్చింది. మంచి నాయకుడిని చేసింది.

అయితే లోకేష్ విషయానికి వచ్చేసరికి.. చంద్రబాబు లెక్క తప్పు అయ్యింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించకుండా.. ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో పోటీ చేయించారు. కానీ లోకేష్ ఓడిపోయాడు. కానీ గత ఐదు సంవత్సరాలుగా బాగానే కష్టపడ్డాడు. సుదీర్ఘంగా పాదయాత్ర చేశాడు. రాజకీయంగా పరిణితి సాధించాడు. టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో.. ఈసారి అయినా పక్కా ప్లాన్ తో లోకేష్ కు పగ్గాలు అందించగలిగితే.. ఆయన తన సమర్థతను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ అనే విధంగా క్యాడర్లో భరోసా కల్పించినట్లు అవుతుంది.