Nara Brahmani Latest Video: విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ( world yoga day) వేడుకలకు భారీగా జనాలు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మంత్రులు లోకేష్ తో పాటు ఇతరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేకువ జాము నుంచే సాగర తీరంలో సందడి నెలకొంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల మేర కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. మూడు లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. చాలామంది ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సామూహిక యోగాసనాలు వేశారు. చంద్రబాబు ఓ కంపార్ట్మెంట్లో సామాన్య జనాల మధ్య యోగాసనాలు వేయగా.. అక్కడకు సమీపంలోనే లోకేష్ దంపతులు యోగాసనాలు వేస్తూ కనిపించారు.
సామాజిక కార్యక్రమాలకు హాజరు..
గత కొద్ది రోజులుగా సామాజిక చైతన్య కార్యక్రమాల్లో నారా బ్రాహ్మణి( Nara bramhani) చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలను చూస్తున్నారు. రాజకీయ వేదికలపై కనిపించడం లేదు కానీ.. సమాజ హిత కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టినప్పుడు మాత్రం హాజరవుతున్నారు. కొద్ది రోజుల కిందట విజయవాడలో తెలుగు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఓ మ్యూజికల్ నైట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్టు విన్నపం మేరకు తల సేమియా తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం కార్యక్రమాన్ని నిర్వహించారు నారా భువనేశ్వరి. అప్పుడు కూడా బ్రాహ్మణి భాగస్వామ్యం అయ్యారు. ఆ వేడుకకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ ద్వారా భారీగా నిధులు సమకూరాయి.
Also Read: Nara Brahmani Padayatra: పాదయాత్రకు నారా బ్రాహ్మణి సిద్ధం?
కొద్ది రోజుల కిందట ప్రధానితో భేటీ..
కొద్ది రోజుల కిందట నారా లోకేష్( Nara Lokesh) కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతోపాటు విందు చేశారు. ఈరోజు ప్రధాని పాల్గొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం లో బ్రాహ్మణి పాల్గొనడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనతో బిజీగా గడిపిన లోకేష్ నేరుగా విశాఖకు వచ్చారు. బ్రాహ్మణి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్ననే విశాఖ చేరుకున్నారు. లోకేష్ బ్రాహ్మణి దంపతులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. బ్రాహ్మణి సామాన్యుల చెంతన యోగాసనాలు వేస్తూ కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సామాన్య వ్యక్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
యోగాంధ్ర కార్యక్రమంలో నారా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి యోగా సాధన pic.twitter.com/KhYGbDydbT
— ChotaNews App (@ChotaNewsApp) June 21, 2025