KCR Vs Chandrababu : కేసీఆర్ మాటల గారడీ ముందు ఎవరైన దిగదుడుపే. ఆ విషయం తెలుగు సమాజానికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. సెంటిమెంట్ సమపాళ్ళలో పండిస్తేనే సినిమా హిట్టయ్యేది. ఈ విషయం తెలియక చాలామంది దర్శకులు చతికిలపడుతుంటారు. కానీ కేసీఆర్ విషయంలో అలా కాదు. టీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచే ఆయన ప్రజల్లో పొలిటికల్ సెంటిమెంట్ రగిల్చి హిట్ ఫార్ములాను సొంతం చేసుకున్నారు. అయితే సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబును బూచిగా చూపి ఎక్కువసార్లు విజయాన్ని దక్కించుకున్నారు. టీడీపీని నామరూపాలు లేకుండా నాశనం చేసినా ఆయన నిద్రపోలేదు. చంద్రబాబును నిందించడం మానలేదు. తాజాగా ఏపీలో పాలనా వైఫల్యాలను ఎత్తిపొడుస్తూ అక్కడి భూముల ధరలను తెలంగాణతో పోల్చిన చంద్రబాబును కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ కడిగి పారేసింది.
అసలు చంద్రబాబు తెలంగాణను ఏమీ అనలేదు. కేసీఆర్ మాదిరిగా ఒక అంశాన్ని ఉదహరించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పది ఎకరాలు కొనవచ్చని కేసీఆర్ తరచూ అంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మాటను అన్నారు. జగన్ సర్కారు వైఫల్యాలు పుణ్యమా అని రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చని చెప్పారు. అయితే దీనిని ఒక ప్రశంసగా తీసుకోకుండా పాత చింతకాయ పచ్చడి మాదిరిగా చంద్రబాబుపై నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఏనాడు తెలంగాణ బాగోగులు పట్టించుకోని చంద్రబాబు ప్రశంసించారంటే ఏదో కుట్ర ఉందన్న కోణంలో కథనాన్ని వండి వార్చారు. దీనిపై తెలంగాణ మేథావులు సైతం అభ్యంతరం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఏంచేసినా బీఆర్ఎస్ కు నచ్చదు. కేసీఆర్ కు అంతకంటే గిట్టదు. సెంటిమెంట్లు రగల్చడం, ప్రజలను రెచ్చగొట్టడం అనేది కేసీఆర్ కు తెలిసినంతగా చంద్రబాబుకు తెలియదు. అదే జరిగితే ఏపీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చుండేది. అయితే ఇక్కడే ఒక లాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణను ప్రశంసించారే కానీ.. తన మిత్రుడు జగన్ ను కించపరచడంతోనే బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నట్టున్నారు. అందుకే తమ పత్రికల్లో సమయం, సందర్భం, తల, తోక లేని కథనాన్ని ప్రచురించారు. దీని ద్వారా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకభావనను బయటపెట్టుకున్నారే కానీ.. పాఠకాదరణ మాత్రం పొందలేకపోయారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ప్రజల ముందు మరింత చులకన అయ్యే చాన్స్ ఉంది.