BCCI Selection Committee: అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు కీలక టోర్నీలను నెగ్గి పదేళ్లు దాటుతోంది. ఈ పదేళ్ళలో భారత జట్టు అనేక మెగా టోర్నీలను ఆడినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక బోల్తా పడుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక కసరత్తు జరుగుతుంది. అయితే ఈ జట్టును ఎంపిక చేస్తున్న సెలక్షన్ కమిటీ లోని సభ్యులను చూసి ప్రస్తుతం అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఈ సెలక్షన్ కమిటీ లోని సభ్యులకు పెద్దగా లేకపోవడం, ఇప్పటి వరకు ఈ సభ్యులు ఎంపిక చేసిన జట్లు కీలకమైన టోర్నీల్లో విఫలం కావడంతో.. ఈ సెలక్షన్ కమిటీ వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేసే జట్టుపై అభిమానులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ప్రతిష్టాత్మకమైన టోర్నీలకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆటగాళ్ల ప్రతిభతో పాటు వారి గత రికార్డులు వంటి అంశాలను సెలక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే, ఆటగాళ్ల గత రికార్డులే కాకుండా సెలెక్టర్ల గత రికార్డులను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అలాగే వీరి క్రికెట్ కెరీర్లు ఉన్న ఘనతలను ఆరా తీస్తున్నారు. అయితే, ఈ ఏడాది భారత్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపికకు నలుగురు సెలక్టర్లతో కూడిన కమిటీని బీసీసీఐ నియమించింది. అయితే, ఈ నలుగురు గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత జట్టు ఈ వరల్డ్ కప్ ఆశలను కూడా వదిలేసుకోవచ్చు అంటూ పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. అసలు ఎవరు ఆ నలుగురు సెలక్టర్లు, వారి గత రికార్డులు ఏమిటో మీరు చూసేయండి.
ఏమాత్రం అనుభవం లేని నలుగురు చేతిలో భారత జట్టు ఎంపిక..
అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఏమాత్రం లేని నలుగురు మాజీ ఆటగాళ్ల చేతిలో వన్డే వరల్డ్ కప్ జట్టు ఎంపిక బాధ్యతను పెట్టారంటూ సెలెక్టర్లను చూసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సెలక్షన్ కమిటీ హెడ్ గా ఉన్న చేతన్ శర్మ ఒక ప్రైవేట్ చానల్స్ స్టింగ్ ఆపరేషన్ లో చిక్కుకోవడంతో ఆ పదవికి రాజీనామా చేశాడు. అయితే ఖాళీగా ఉన్న సెలక్షన్ కమిటీ హెడ్ పోస్ట్ ను భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇప్పటివరకు ఆసక్తిని ప్రదర్శించలేదు. కమిటీలో మిగిలిన నలుగురు సభ్యులు మాత్రమే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన భారత జట్టును ఎంపిక చేయనున్నారు. వీరిలో శివ సుందర దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధర్ శరత్ ఉన్నారు. వీరే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే వీరిలో ఎవరికీ కూడా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పెద్దగా లేకపోవడం తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమవుతోంది. ఈ నలుగురు సభ్యులు గతంలో ఎంపిక చేసిన జట్టు కీలక టోర్నీలో ఘోరంగా విఫలమైన దానిని పెద్ద ఎత్తున ఉదహరిస్తున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు భారత తరఫున 30 వన్డేలు మాత్రమే ఆడగా, ఒకరు అయితే టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడక పోవడం గమనార్హం.
సెలక్టర్ల రికార్డులను పరిశీలిస్తే..
వన్డే వరల్డ్ కప్ కు భారత జట్టును ఎంపిక చేస్తున్న కలెక్టర్ల భారత జట్టుకు ఆడిన వివరాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. సుబ్రోతో బెనర్జీ భారత జట్టు తరుపున ఆరు వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడాడు. అలాగే సలీల్ అంకోలా భారత జట్టు తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ 20 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. శివ సుందర్ దాస్ భారత జట్టుకు 23 టెస్టులు, నాలుగు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక శ్రీధరన్ శరత్ టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 139 మ్యాచులు మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆశించిన స్థాయిలో అనుభవం లేని వారిని సెలెక్టర్లుగా నియమించి ఎటువంటి ఆటగాళ్లను వరల్డ్ కప్ కు ఎంపిక చేయనున్నారు అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టి20 జట్టును ఎంపిక చేసిన ఇదే కమిటీ..
గత ఏడాది నిర్వహించిన టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన భారత జట్టును ఈ సెలెక్టర్లే ఎంపిక చేశారు. పేలవ ఫామ్ లో ఉన్న కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేసి భారత జట్టు ఓటమికి కారణమయ్యారంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాగే తాజాగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత జట్టు ఈ సెలెక్టర్లే ఎంపిక చేశారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను తప్పించి, ఫామ్ లో లేని వారిని తీసుకోవడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇదే కమిటీ వన్డే ప్రపంచ కప్ కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు సిద్ధమవుతుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ సెలక్టర్ల గత రికార్డులను పరిశీలిస్తున్న అభిమానులు ఈ వరల్డ్ కప్ కూడా భారత జట్టు కొట్టినట్టే అంటూ సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి వన్డే వరల్డ్ కప్ కు ఎటువంటి ఆటగాళ్లను ఈ సెలెక్టర్లు ఎంపిక చేస్తారో. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసి వరల్డ్ కప్ సాధించేలా చేయడం ద్వారా తమపై ఉన్న విమర్శలకు విజయంతోనే జవాబిస్తారో, లేక ప్రస్తుతం ఉన్న విమర్శలకు బలాన్ని చేకూర్చేలా ఎప్పటిలాగానే సాధారణ జట్టు ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది.