https://oktelugu.com/

Pithapuram: పిఠాపురంలో తన్నులాట.. పవన్ కళ్యాణ్ గారూ చూస్తున్నారా?

సాధారణంగా ప్రతి కార్యాలయాల్లో అధికారుల మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంటుంది. వివాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ అధికారులు అందరూ చూస్తుండగానే కొట్టుకోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 31, 2024 / 06:25 PM IST

    Pithapuram

    Follow us on

    Pithapuram:పిఠాపురం నియోజకవర్గం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచారు. కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ హోదాను దక్కించుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తయారు చేస్తానని.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు పవన్. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమే అందుకు కారణం. అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాటి అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు ఒక్కసారిగా బిత్తర పోయారు. అయితే సాధారణంగా వేరే నియోజకవర్గంలో అయితే ఇది పెద్ద వార్తగా నిలిచేది కాదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ ఘటన జరగడంతో చర్చకు దారితీస్తోంది. పిఠాపురం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

    * చాలా రోజులుగా విభేదాలు
    పిఠాపురం మున్సిపాలిటీకి డిఈ గా భవాని శంకర్ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన చాలా రోజుల పాటు సెలవు పై వెళ్ళిపోయారు. మున్సిపల్ కమిషనర్ గా కనకారావు విధుల్లో ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డి ఈ భవాని శంకర్ కార్యాలయంలో ఉండగానే.. కమిషనర్ ఈఈ సంతకాలు చేయించుకోవడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే విషయంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తరచూ వివాదాలు కూడా జరుగుతున్నాయి.

    * చిలికి చిలికి గాలి వానలా
    పిఠాపురం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి కమిషనర్ కనకారావు, డిఈ భవాని శంకర్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే ఒక విషయంలో ఇద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఆవేశానికి గురై తిట్ల దండకం అందుకున్నారు. ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడున్న వారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు.

    * మీడియాలో హైలెట్
    అయితే ఈ సమావేశంలో జరిగిన రగడ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది. సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కావడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అధికారులకు పవన్ పిలుపునిచ్చారు. కానీ ఓ ఇద్దరు సీనియర్ అధికారులు తమ స్థాయిని మరచి సమావేశంలోనే కొట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారో? చూడాలి.