Murali Mohan Padma Shri Award: తెలుగు చిత్ర ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. సీనియర్ నటులు మురళీమోహన్( Murali Mohan), రాజేంద్రప్రసాదులకు పురస్కారాలు వరించాయి. అయితే ఇందులో మురళీమోహన్ సినీ, వ్యాపార, రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. తొలుత సినిమాల్లో నటించి.. అందులో ఉండగానే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ రంగంలోనైనా విజయవంతంగా ముందుకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు మురళీమోహన్. అటువంటి వ్యక్తికి ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం.
అసలు పేరు రాంబాబు..
మాగంటి మురళీమోహన్.. ఆయన అసలు పేరు మాగంటి రాజబాబు. 1940, జూన్ 24న పశ్చిమగోదావరి( West Godavari ) జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. మురళీమోహన్ ప్రాథమిక విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. అయితే 1963 లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారంలో కొనసాగుతూనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అలా 1973లో ఆయనకు సినిమా అవకాశం దక్కింది. జగమే మాయ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ 1974లో దాసరి దర్శకత్వంలో వచ్చిన తిరుపతి సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 350 తెలుగు చలన చిత్రాల్లో నటించారు మురళీమోహన్. సోదరుడు కిషోర్ తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 25 చిత్రాలను నిర్మించారు. 2017 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మురళీమోహన్. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. సినీ రాజకీయ రంగాల్లో ఉండగానే జయభేరి గ్రూప్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టింది. ఆ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన కోడలు ఆ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో అదే స్థానం నుంచి బిజెపి అభ్యర్థి పురందేశ్వరి పోటీ చేసి గెలిచారు. త్వరలో రాజ్యసభ ఎంపికలో మురళీమోహన్ కు అవకాశం దొరుకుతుందని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం విశేషం.