Pawankalyan – AP Volunteers : వలంటీర్ వ్యవస్థపై పవన్ ఆరోపణల్లో పక్కా వ్యూహం ఉందా? ఎక్కడా వెనక్కి తగ్గకుండా స్ట్రాంగ్ గా నిలబడడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ప్రజల్లో బలమైన చర్చ జరగడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ జరుగుతోంది. వలంటీరు వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ వ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. వలంటీర్లతో పాటు వైసీపీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నా పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను ఎందుకు అలా మాట్లాడి వచ్చింది అన్నదానిపై వివరణ ఇచ్చారు. అవసరమైతే వలంటీరు వ్యవస్థపై కోర్టుకు వెళతానని సంకేతాలు పంపారు.
అయితే పవన్ బహుముఖ వ్యూహంతోనే వలంటీరు వ్యవస్థపై టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఎక్కువ చర్చ జరగాలన్నదే పవన్ ప్రధాన ఉద్దేశ్యం. ఎంత చర్చ జరిగితే అంతలా ప్రజల్లోకి వెళుతుందన్న ఎత్తుగడ కనిపిస్తోంది. ఇప్పటికే వలంటీరు వ్యవస్థ ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లిపోయింది. వారిపై అధికార పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, స్థానిక వైసీపీ నాయకులకు వలంటీర్ల చర్యలు మింగుడుపడడం లేదు. వారిని సంతృప్తి పరచి జనసేన వైపు తిప్పుకోవాలన్నది పవన్ ప్రధాన వ్యూహం.
వలంటీరు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నియంత్రించడం రెండో వ్యూహం. వలంటీర్ల చర్యలపై అనుమానం కలిగేలా చూడడం. వలంటీరు ఎటువంటి సమాచారాన్ని అడిగినా ప్రజలు అనుమానాస్పద దృక్పథంలో చూడాలన్నది మరో ఆలోచన. ప్రభుత్వానికి పాజిటివిటీ దక్కినా వ్యవస్థ విషయంలో మాత్రం నెగిటివ్ గా చూపించాలన్నది పవన్ ప్లాన్. మూడో ఎత్తుగడగా వలంటీర్లలో భయం పుట్టించాలి. జన సైనికులు, సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు, పౌరసేవల విషయంలో వలంటీర్లు భయంతో పనిచేయాలన్నది మరో ఎత్తుగడ. ఇలా బహుముఖ వ్యూహంతోనే పవన్ వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వలంటీరు వ్యవస్థ ద్వారా గెలుపొందాలన్నది జగన్ ప్లాన్. అందుకే గెలుపుపై జగన్ అతి ధీమాతో ఉన్నారు. దీనిని గుర్తించిన పవన్ వలంటీర్లను టార్గెట్ చేసుకున్నారు. రేపు జనసేన కానీ.. జనసేన సపోర్టుతో వచ్చే ప్రభుత్వంలో మనుగడ సాధించాలంటే వలంటీర్లు వెనక్కి తగ్గాలని.. అందుకే జగన్ నేరుగా హెచ్చరికలు జారీచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో పవన్ బహుముఖ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఎల్లో నీలి మీడియాలు మాత్రం పవన్ వలంటీర్లపై మాట్లాడి అడ్డంగా బుక్కాయ్యారని ప్రచారం చేస్తున్నాయి.