AP CM YS Jagan : ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఎన్నికల షెడ్యూల్.. అక్కడకు కొద్దిరోజులకే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో చాలా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు జగన్ డిసైడయ్యారు. అందుకే మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, మూడు రాజధానుల అంశంతో పాటు అసైన్డ్ భూముల విక్రయాలకు అనుమతి, కొత్తగా సంక్షేమ పథకాల అమలుపై జగన్ ఫోకస్ పెంచారు. నేడు మంగళగిరిలో జరగనున్న కేబినెట్ మీటింగ్ లో వీటిపై చర్చించనున్నారు. స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
ముందస్తు ఎన్నికలపై అనేక రకాల ఊహాగానాలు వెలువడ్డాయి, అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే ఉన్న కొద్ది నెలల్లో ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది జగన్ ప్లాన్. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిశారు. రాష్ట్ర విభజన సమస్యలపై వినతిపత్రాలు అందించారు. చాలా విషయాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో చర్చించారు. వాటి సారాంశాలను, వ్యూహాలను మంత్రివర్గ సహచరులకు జగన్ వివరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరో వైపు జాబ్ కేలండర్ అమలు విషయంలో వచ్చిన విమర్శలను తిప్పికొట్టేవీలుగా ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. ఏటా ఉద్యోగాల ఖాళీల వివరాలతో జాబ్ కేలంటర్ ప్రకటించనున్నట్టు జగన్ తన నవరత్నాల్లో చెప్పుకొచ్చారు. దీనిపై గత నాలుగేళ్లుగా ఎటువంటి ప్రకటన లేదు. దీంతో నిరుద్యోగ యువతలో అసంతృప్తి నెలకొంది. ఒక్క వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల భర్తీ తప్ప మరేం కనిపించలేదు. దీంతో త్వరలో మెగా డీఎస్సీ ప్రకటనకు జగన్ సానుకూలత ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, విక్రయాల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల విక్రయం కోసం దళితుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నారు. 20 సంవత్సరాలు పైబడిన అసైన్డ్ భూములు విక్రయించుకునేలా బిల్లు పాస్ చేయనున్నారు. 1.60 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములను 22(ఏ) నుంచి తొలిగించేందుకు ఆమోదం తెలపేందుకు ఫైల్ సిద్దమైంది. 1,700 దళిత వాడల్లో శ్మశాన వాటికలకు వెయ్యి ఎకరాలు కేటాయిస్తూ మరో నిర్ణయం తీసుకోనున్నారు. తమకు కేటాయించిన అసైన్డ్ భూములను అమ్ముకొనేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే 22(ఏ) కింద ఉన్న సాగు భూములకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు అసైన్డ్ భూముల పైన నిర్ణయం తీసుకోనున్నారు.
రాజకీయపరమైన విధానాలపై పవన్ మరింత స్పష్టతనివ్వనున్నారు. వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు ఎలా అనుకూలంగా మార్చుకోవాలి? విశాఖ రాజధాని విషయంలో ఎదురవుతున్న ప్రతికూలతలు, విశాఖ నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ద్వారా పాలన వంటి అంశాలపై కేబినెట్ సహచరుల అభిప్రాయాలను జగన్ స్వీకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కేబినెట్ మీటింగ్ హాట్ హాట్ గా జరగనుందన్న మాట. మొత్తం 70 అంశాలను చర్చించడానికి అజెండాగా పెట్టుకున్నట్టు సమాచారం.