Facebook Cheating: అతడో వ్యాపారి. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ చూస్తుండగా అందమైన యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. క్షణాల్లో ఆమోదం తెలిపాడు. చాటింగ్‌తో మొదలై ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేంత వరకూ చేరింది. తాను ముంబయిలో ఉన్నానని.. రెండ్రోజులు సరదాగా గడిపేందుకు వస్తానంటూ ప్రయాణ ఖర్చులకు రూ.50 వేలు జమ చేయించుకుంది. ఆరోగ్య సమస్యలతో రాలేక పోతున్నానంటూ వాయిదా వేస్తూ వచ్చింది.
వీడియోకాల్‌లో వివరాలు రికార్డ్..
అతడు కుటుంబ, వ్యక్తిగత విషయాలను వాట్సాప్ వీడియోకాల్ ద్వారా మాట్లాడుతున్నపుడు రికార్డు చేసింది. తర్వాత అసలు రూపం ప్రదర్శించింది. బెదిరించటం ప్రారంభించింది. విషయం బయటపడితే పరువు పోతుందనే ఉద్దేశంతో రూ.20 లక్షల వరకూ చెల్లించాడు. మరింత కావాలంటూ డిమాండ్ చేయటంతో బాధితుడు నగర సైబర్‌క్రై మ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు గుర్తించారు.
ఎంతో మందిని ఇలాగే..
ముంబయికి చెందిన ఆమె ఎంతోమందిని ఇదే తరహాలో మోసగించినట్టు నిర్ధారించారు. అవతలి వారికి నమ్మకం కుదిరినట్టు నిర్ధారించుకోగానే ఆ వ్యక్తి బలహీనతలను ఆమె అంచనా వేస్తుంది. అతడు భార్యతో ఎలా ఉంటాడనే గోప్యమైన వివరాలను సేకరించి డబ్బు వసూలు చేయడం ఈమె శైలి అని గుర్తించారు. మాయలేడి జాబితాలో నగరానికి చెందిన ఎంతో మంది మోసపోయినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు మాత్రమే పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల గిలగిల
సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక మహిళ ముంబయి రమ్మంటూ ఆహ్వానించగానే వెళ్లిపోయాడు. అక్కడ ఇద్దరూ హోటల్‌రూమ్‌లో ఉండగా వచ్చిన అగంతకులు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి భారీగా డబ్బు గుంజినట్టు తెలుస్తోంది. నగరానికి వచ్చాక విషయం మిత్రులతో పంచుకోవటంతో ఘటన వెలుగు చూసింది. వలపు వలతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు ప్రశ్నిస్తే కిలేడీలు ఎదురు తిరుగుతున్నారు. తమనే లైంగికంగా వేధించారంటూ చాటింగులు, వ్యక్తిగత ఫొటోలు బయటపెట్టగానే బాధితులు మౌనం వహిస్తున్నారు. ఈ తరహా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారని నగర సైబర్‌క్రై మ్ ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వారితో వ్యక్తిగత అంశాలు పంచుకోవద్దని సూచించారు.