Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కాపు ఉద్యమాన్ని చేపట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం విధ్వంసానికి దారితీసింది. వందలాది మందిపై కేసుల నమోదుకు కారణమైంది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ యూటర్న్ తీసుకున్నారు. ఉద్యమాన్ని ఉన్నఫలంగా నిలిపివేశారు. కాపులకు వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకున్నా నోరు మెదపలేదు. ఈ తరుణంలో ఆయన వైసీపీలో చేరతారని గత కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. కానీ వైసీపీ హై కమాండ్ ముద్రగడ కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. ఒకానొక దశలో జనసేనలో చేరతారని టాక్ నడిచింది. కానీ పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అవమానంగా భావించిన ముద్రగడ వైసీపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. తానే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ముద్రగడ చేరికతో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడ ప్రభావం అధికంగా ఉంటుందన్నది అంచనా. కాపుల్లో వంగవీటి మోహన్ రంగా తర్వాత ముద్రగడ గుర్తింపు సాధించారు. కానీ మోహన్ రంగా మాదిరిగా ప్రభావం చూపలేకపోయారు. నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ.. కాపు ఉద్యమాన్ని నడిపిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. 2014 తర్వాత.. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం పతాక స్థాయికి వెళ్లడంతో చంద్రబాబు సర్కార్ స్పందించాల్సి వచ్చింది. కాపులకు ఈ బీసీ రిజర్వేషన్లు వర్తింపజేసేలా చంద్రబాబు జీవోలు ఇచ్చారు. వివిధ రకాల పథకాలను సైతం అమలు చేశారు. అయితే కాపులను చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా మార్చడంలో ముద్రగడ సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీపై కోపంతోనే ముద్రగడ అలా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. వైసీపీ వైపు కాపులను మళ్లించారని కూడా విమర్శ ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ ద్వారా కాపులకు న్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గం వారు ఆశించారు. కానీ నాలుగున్నర సంవత్సరాలుగా అడుగడుగునా కాపులకు అవమానాలు జరుగుతున్నాయి. అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ నిలిపివేశారు. పథకాలను సైతం నిలిపివేసి అన్నింటినీ నవరత్నాల్లో చూపించారు. ఇంత జరుగుతున్న ముద్రగడ ఏనాడూ నోరు మెదపలేదు. పైగా జగన్ చర్యలను సమర్థిస్తూ అనుకూలంగా లేఖలు రాసేవారు. అందుకే కాపు సామాజిక వర్గంలోనే ముద్రగడ పై ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. ముఖ్యంగా కాపు యువత ఆయనకు దూరమైంది. పవన్ కళ్యాణ్ కు దగ్గర అయింది. అందుకే ముద్రగడ సైతం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ తో వెళ్తేనే కాపుల్లో తనకు ఆదరణ ఉంటుందని ఆయన గ్రహించారు. పవన్ కళ్యాణ్ కు స్నేహ హస్తం అందించారు. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ముద్రగడను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన వైసీపీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఈ తరుణంలో ముద్రగడ వైసీపీలో చేరిన ఆ సామాజిక వర్గం మాత్రం వెళ్లే అవకాశం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి.
ముద్రగడ దశాబ్దాలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చివరిసారిగా ఆయన 2009లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నుంచి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978, 1983,1985, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. మధ్యలో 1999లో ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. 2009లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ముద్రగడ వెనుక కాపు సామాజిక వర్గం ఉంటుందని భావించిన వైసిపి ఆయనను పార్టీలో చేర్చుకుంటోంది. కానీ ఇప్పటికే మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఫిక్స్ అయ్యింది. ఈ తరుణంలో ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఎంతవరకు ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది అన్నది చూడాలి.