Mudragada padmanabham : ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ ముద్రగడ పద్మనాభం. కానీ రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడ్డారు. ఆయన రాజకీయ నేతగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే సుపరిచితుడు. అయితే తన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో అనుకున్నది సాధించలేకపోయారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే ఇంచుమించు చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు అన్నమాట. ఎన్టీఆర్ క్యాబినెట్లు మంత్రిగా పనిచేసిన ముద్రగడ.. తరువాత ఎంపీగా కూడా గెలిచారు. అయితే ఆయన రాజకీయ జీవితం సవ్యంగా సాగలేదు. వంగవీటి మోహన్ రంగ తర్వాత.. కాపులంటే ముద్రగడ, ముద్రగడ అంటే కాపులు అన్నట్టుగా వ్యవహారం నడిచింది. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో సీన్ మారిపోయింది. క్రమేపి కాపులు ముద్రగడ నుంచి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతు తెలిపారు పవన్. దీంతో పవన్ వైపు కాపులు టర్న్ అయ్యారు.2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయింది. టిడిపి సైతం పరాజయం పాలయ్యింది. ఆ సమయంలో ముద్రగడకు మంచి ఛాన్స్ వచ్చింది. జగన్ ద్వారా కాపులకు మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయారు ముద్రగడ.
* రాజ్యాధికారం కల
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నది కాపుల ప్రధాన కల. అది ముద్రగడ ద్వారా సాధ్యమవుతుందని అంతా భావించారు. అయితే ఆయన తప్పుడు నిర్ణయాలతో కాపులకు దూరమయ్యారు. అయితే ఈ ఎన్నికలకు ముందు మంచిగానే అంచనా వేశారు. జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తన ఇంటికి వచ్చి పవన్ ఆహ్వానించలేదన్న మనస్థాపంతో మళ్లీ తప్పుడు నిర్ణయమే తీసుకున్నారు. తిరిగి వైసీపీలోనే చేరారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ముద్రగడ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది.
* సమయం వృధా
ఏడు పదుల వయసున్న ముద్రగడ.. తాను అనుకున్నది మాత్రం సాధించలేకపోయారు. కాపులకు రిజర్వేషన్ తెచ్చుకోలేకపోయారు. అలాగని రాజకీయ జీవితాన్ని సైతం వృధా చేసుకున్నారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఆ పార్టీలో చేరాల్సి ఉండేది. రాజకీయంగా పదవులు చేపట్టి కాపుల రిజర్వేషన్ కు జగన్ ను ఒప్పించాల్సి ఉండేది.అప్పుడే కాపుల్లో ఒక రకమైన సంతృప్తి కనిపించేది. కానీ ముద్రగడ అలా చేయలేదు. ఐదేళ్ల పాటు స్తబ్దుగా ఉండిపోయి పవన్ పట్టించుకోలేదన్న మనస్థాపంతో వైసీపీ వైపు వెళ్లారు. పాపం వైసిపి ఓడిపోయింది. ముద్రగడకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. క్రమేపి రాజకీయాలనుంచి దూరం కావడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* కొత్త జనరేషన్ పవన్ వెంట
కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడకు మంచి పేరు ఉండేది. కానీ దానిని చేజేతులా దూరం చేసుకున్నారు. కాపుల్లో కొత్త జనరేషన్ ఇప్పటికే పవన్ వెంట నడుస్తోంది. ముద్రగడ చేసిన తప్పిదాలతో కాపు సమాజం ఆయనను నమ్మడం లేదు. ఈ ఎన్నికల్లో పవన్ పై ముద్రగడ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి కూడా మైనస్ గా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆయన రాజకీయాలనుంచి గౌరవంగా పక్కకు తప్పుకోవడం మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ముద్రగడ చర్యలు కూడా అలానే ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More