Mudragada Padmanabha Reddy: రాజకీయాల్లో( politics) ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. చిన్నపాటి మాట దొర్లినా దానికి మూల్యం తప్పదు. అయితే ఇప్పుడు చాలామంది నేతలు మాట దాటి పోతున్నారు. తమ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. అయితే ఈ కోవలోకి వెళ్తారు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం. ఓ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఫలాలు అందాలని ఆయన సుదీర్ఘకాలం పోరాటం చేశారు. కాపు అంటేనే ముందుగా గుర్తుకొచ్చే విధంగా తన కెరీర్ ను మలుచుకున్నారు ముద్రగడ పద్మనాభం. అటువంటి వ్యక్తి తన పేరు చివరన రెడ్డి అని చేర్చుకోవాల్సి వచ్చిందంటే.. అది ముమ్మాటికీ ఆయన తప్పిదమే. ఆవేశపూరితంగా ప్రకటన చేశారు. ఆత్మాభిమానం కలిగిన మనిషిగా ఆ పని చేయక తప్పలేదు. అయితే ఇప్పటికీ అదే వైఖరితో ఆయన ఉండడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక కాపు ఉద్యమనేత రెడ్డి అని పిలిపించుకోవడం ఏమిటి అనేది కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మాట.
Also Read: విజయసాయిరెడ్డికి ఓకే.. చంద్రబాబుతో చర్చించనున్న బిజెపి పెద్దలు!
* సుదీర్ఘ నేపథ్యం..
సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ). ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీలో గడిపారు. తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ పార్టీ నేత కంటే కాపు ఉద్యమ నేతగానే ఉమ్మడి రాష్ట్రం తో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు. అయితే ఈ గమనంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్నింటికీ మించి వివాదాలను కూడా తెచ్చుకున్నారు. ఈ సామాజిక వర్గం కోసం పోరాటం చేశారో.. అదే సామాజిక వర్గం నుంచి అనుమానపు చూపులను ఎదుర్కొన్నారు. అందుకే ఇకనుంచి ఉద్యమాలు చేయనని తేల్చి చెప్పారు.
* పవన్ ను ఓడిస్తానని శపథం ..
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan). అయితే ఎన్నికలకు ముందు జనసేనలోకి ముద్రగడ అంటూ ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఆశించిన స్థాయిలో ఆహ్వానం అందలేదు. దీంతో ముద్రగడ మనసు మార్చుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత ముద్రగడ పై పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ముద్రగడ ఒక అడుగు ముందుకు వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సూపర్ విక్టరీ కొట్టారు. దాదాపు 70 వేల మెజారిటీతో గెలిచారు. దీంతో ముద్రగడ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు ఎప్పుడు మార్చుకుంటారని నెటిజెన్లు ప్రశ్నించారు. అయితే ఆత్మ అభిమానం కలిగిన ముద్రగడ తన పేరు మార్పు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం సైతం ముద్రగడ పద్మనాభ రెడ్డి గా గుర్తించి ఆదేశాలు ఇచ్చింది.
* ఆ లెటర్ పై తాటికాయ అంత అక్షరాలతో..
ఒక ఆత్మాభిమానం కలిగిన నేతగా ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఉంది. ఎన్నికల్లో ప్రకటన చేశారు కనుక ఆయన దానిని అమలు చేసి చూపించారు. కానీ ఒక కాపు సామాజిక వర్గ నేతగా ఉండి.. పేరు చివరన రెడ్డి అని చేర్చుకోవడాన్ని మాత్రం.. కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు ముద్రగడ పద్మనాభం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు ముద్రగడ. అందులో కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ రాసి ఉండడాన్ని ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది.