Mudragada into YCP : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారా? తాజాగా ఆయనతో అధికార పార్టీ నేతలు జరిపిన చర్చలేంటి? విందు రాజకీయాలు దేనికి సంకేతం? గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాపు నాయకుల్లో ముద్రగడ పద్మనాభానిది ప్రత్యేక స్థానం. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం నడిపారు. అటువంటి నేత తమ వైపు ఉంటే గోదావరి జిల్లాల రాజకీయాన్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ ఫుల్ స్టాప్ పెట్టారు. ఉద్యమం జగన్ కోసమే చేపట్టారన్న అపవాదు ఉంది. అటు వైసీపీ సైతం ముద్రగడను తమవాడిగానే చూస్తోంది. ముద్రగడ మీద గత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను కూడా జగన్ సీఎం అయ్యాక తీయించేశారు.
ఇటీవలే తుని రైలు దహనం కేసుల నుంచి ముద్రగడకు విముక్తి లభించింది. రైల్వే కోర్టు ముద్రగడతో పాటు మరికొందర్ని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ముద్రగడ ఫ్రీబర్డ్ అయ్యారు. రాజకీయం కోసం ఆలోచిస్తున్నారు. తన గురించి కాకున్నా కుమారుడికి మంచి పొలిటికల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారు. అటు ముద్రగడ అవసరం ఉండడంతో వైసీపీ కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. నిన్నటికి నిన్న కాకినాడ ఎంపీ వంగా గీత, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు పలువురు వైసీపీ ఎంపీపీలు, కాపు నేతలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయనతో మంతనాలు జరిపారు. అక్కడే అంతా కలిసి విందు చేసుకున్నారు.
ఇటీవల కాలంలో ముద్రగడను వైసీపీ నేతలు కలవడం ఇది రెండోసారి. ఈ మధ్యకాలంలోనే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముద్రగడ నివాసానికి వెళ్ళి చాలా సేపు చర్చలు జరిపారు. ఇపుడు కాకినాడ ఎంపీ, అందునా కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వంగా గీత వెళ్లి చర్చలు జరపడంతో ముద్రగడ వైసీపీలో చేరికకు మార్గం సుగమం చేస్తున్నట్టేనన్న చర్చ సాగుతోంది. ముద్రగడను కాకినాడ ఎంపీగా పోటీ చేయించాలన్న ప్రతిపాదన వైసీపీలో బలంగా ఉంది. అది కాదంటే ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో వైసీపీ నేతలు వరుసబెట్టి కలుస్తుండడం అనుమానాలకు బలం చేకూరుతోంది.
ప్రస్తుతానికైతే వైసీపీ నేతలతో ముద్రగడ జరిపిన చర్చల సారాంశమేమిటీ బయటకు రావడం లేదు. ఎవరూ బయటపడడం లేదు. కానీ వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ముద్రగడను తమ వైపు తెచ్చుకుంటే ఆయనకు కాపుల్లో ఉన్న క్రెడిబిలిటీతో పాటు ఆయన కాపు సామాజిక వర్గం కోసం చేసిన పోరాటాలు కూడా తమకు కలసి వస్తాయని భావిస్తోంది. ఇప్పటికే చంద్రాబు, పవన్ లు ఒకేతాటిపైకి రావడంతో కాపు ఓటు బ్యాంకు అటువైపు వెళ్లే చాన్స్ ఉందని ప్రచారం ఉంది. అటు చంద్రబాబు అంటే ముద్రగడకు పడదు. అందుకే ముద్రగడను ముందుంచి కాపు ఓటు బ్యాంకులో చీలిక తేవాలన్నది వైసీపీ వ్యూహం. అందుకే ముద్రగడపై ఆ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. మరి అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.