Colombia: విమానం కూలిన ఘటనలో చనిపోయారనుకున్న చిన్నారులు 40 రోజులు తర్వాత ప్రాణాలతో బయటపడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అమెజాన్ అడవుల్లో 40 రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు అడవిలో తప్పిపోయారు. రోజులు గడవడంతో వీరంతా చనిపోయారని అంతా భావించారు. అయితే, అడవిలో తప్పిపోయిన ఈ చిన్నారులను అధికారులు ఎట్టకేలకు సజీవంగా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన ఈ చిన్నారులను చూసి అందరూ ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది.
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గల దట్టమైన అమెజాన్ అడవుల్లో అద్భుతం జరిగింది. నిత్యం క్రూర మృగాలు సంచరించే ఈ కారడవిలో 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు చిన్నారులను ఎట్టకేలకు అధికారులు సజీవంగా గుర్తించారు. ఓ విమాన ప్రమాదం నుంచి వీరు మృత్యుంజయులుగా బయటపడడం విశేషం. ఇందులో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది.
రంగంలోకి దిగిన సైన్యం.. ఆపరేషన్ హోప్..
అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారా క్యూరా నుంచి శాన్జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటో తేదీన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలెట్ ఉన్నారని అధికారులు తెలిపారు, అయితే విమానం టేక్ ఆఫ్ ఆయన కొద్దిసేపటికి ఇంజిన్ లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. అనంతరం ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఆపరేషన్ హోప్ పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలెట్, చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలను గుర్తించారు.
చిన్నారుల కోసం తీవ్రంగా గాలింపు..
అయితే, విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలంలో వారు కనిపించకపోవడంతో చిన్నారుల కోసం గాలించారు. దాదాపు 150 మంది సైనికులు, జాగిలాలతో అమెజాన్ అడవిని జల్లెడ పెట్టారు. ఈ క్రమంలోనే మే 18న పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్న గుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. దీంతో పిల్లలు అడవుల్లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకునేసరికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అయితే, క్రూర మృగాలు తిరిగే ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఆ చిన్నారులు తమను తాము ఎలా కాపాడుకున్నారు అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడ హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే ఆ చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు.
హర్షాతిరేకాలు వ్యక్తం..
ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కనిపించడంతో కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. సైనికులతో చిన్నారుల ఉన్న దృశ్యాలను కొలంబియా మిలిటరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మా ప్రయత్నాలు ఫలించాయి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ”ఈ ఆడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు. మా కొలంబియాకు కూడా వారసులే” అని ఆ దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.
Web Title: Four children missing in the jungle for 40 days after a plane crash in colombia have been found alive
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com