MP-MLA Protocol : ఏపీలో( Andhra Pradesh) ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పీకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మర్యాదలు సక్రమంగా జరగాలని ఆదేశించింది. అధికారులు వెంటనే స్పందించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వానికి మార్చి 26న లేఖ రాశారు. ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఇకనుంచి ఈ రూల్స్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
Also Read : చెరువుల్లో మట్టి పొలాలకు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
* స్పీకర్ లేఖతో
చాలా జిల్లాల్లో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు. సరిగ్గా స్పందించడం లేదని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.’ ప్రజల సమస్యలను మంత్రులు రాష్ట్ర, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని అయ్యన్నపాత్రుడు( speaker Ayyannapathrudu )అభిప్రాయపడుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. జిల్లా అధికారులు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం లేదని.. గంటల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారని కూడా ఆ లేఖలు ప్రస్తావించారు. ప్రజా సమస్యలపై విజ్ఞప్తుల విషయంలో అధికారులతో పాటు కొందరు మంత్రులు కూడా సరిగ్గా స్పందించడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రోటోకాల్ విషయంలో జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది.
* అవే మార్గదర్శకాలు..
2012లో ప్రోటోకాల్( protocol) విషయంలో అప్పటి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తాజాగా స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతి పత్రాలపై వెంటనే స్పందించాలని.. వారు అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు వెంటనే సమయం కూడా కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత సేవలు అందించగలరని భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో సత్వరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, వారి వినతులకు వెంటనే పరిష్కార మార్గం చూపడం, వారు కోరిన సమాచారాన్ని సత్వరం అందించడం, వారిని మర్యాదగా కలవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వడం, వారి ఫోన్ కాల్స్ కు వెంటనే స్పందించడం, సమావేశాల్లో వారికి ప్రత్యేక స్థానం కల్పించడం, ప్రభుత్వ కార్యక్రమాలకు వారికి ప్రత్యేకంగా ఆహ్వానించడం వంటివి కచ్చితంగా చేయాలి.
* పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే..
ప్రోటోకాల్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తప్పవని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టమైంది.